తమిళసినిమా: థియేటర్ల యజమానులు సమ్మె బాట పట్టడంతో దీపావళికి విడుదలకు ముస్తాబవుతున్న చిత్రాలు కష్టాల్లో పడ్డాయి. అదే విధంగా శుక్రవారం కొత్త చిత్రాలు విడుదల కాలేని పరిస్ధితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం విధించిన వినోదపు పన్నే ఈ సమస్యలకు కారణంగా మారింది. కేంద్రప్రభుత్వం జీఎస్‌టీ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో అసలు సమస్య మొదలైంది. 28 శాతం జీఎస్‌టీ పన్నుతో పాటు రాష్ట్రప్రభుత్వం అదనంగా 30 శాతం వినోదపు పన్ను విధించడానికి సిద్ధం కావడంతో షాక్‌కు గురైన థియేటర్ల మాజమాన్యం వినోదపు పన్నును వ్యతిరేకిస్తూ గత జూలై మూడో తేదీన సమ్మెను ప్రకటించారు. ఈ వ్యవహారంపై చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడంతో సమ్మెను విరమించుకున్నారు. తాజాగా గత నెల 27వ తేదీన రాష్ట్ర నగర పాలక సంస్థ 10 శాతం వినోదపు పన్నును విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ పన్ను విధానాన్ని థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమిళ నిర్మాతల మండలి కూడా వినోదపు పన్నును పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది.
దిపావళి నుంచి థియేటర్లు బంద్?
ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం మదురైలో థియేటర్ల యాజమాన్యం సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టికెట్ ధర, జీఎస్‌టీ పన్నుతో పాటు మళ్లీ రాష్ట్రప్రభుత్వం అదనంగా పన్ను విధిస్తే ప్రేక్షకులు థియేటర్లకు రారని అభిప్రాయపడ్డారు. కాబట్టి రాష్ట్రప్రభుత్వం వినోదపుపన్నును పూర్తిగా రద్దు చేయాలని, లేని పక్షంలో దీపావళి నుంచి థియేటర్లను మూసివేసి పోరాటానికి సిద్ధం అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మదురై, రామనాథపురం, దిండుగల్, విరుదనగర్, శివగంగూ, తేని ఆరు జిల్లాల థియేటర్ యాజమాన్యం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా రాష్ట్రప్రభుత్వం విధించిన వినోదపు పన్నును రద్దు చేయాలని లేని పక్షంలో థియేటర్లను మూసివేస్తామని చెన్నై, కాంచీపురం,తిరువళూర్, థియేటర్ల యాజమాన్యం ప్రకటించారు. టికెట్ల ధరను పెంచడం,పైరసీని అరికట్టడం వంటి అంశాలపై ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చెన్నైలో మంగళవారం నుంచే వినోదపుపన్నును వ్యతిరేకిస్తూ పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలో చిత్ర ప్రదర్శనలను నిలిపివేశారు. శుక్రవారం విడుదల కానున్న కొత్త చిత్రాల పరిస్థితి అయోమయంగా మారింది. ఇకపోతే దీపావళి పండగ సందర్శంగా విజయ్ నటించిన మెర్శల్ వంటి కొన్ని భారీ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. బారీ చిత్రాలంటే కనీసం రూ.50,60 కోట్ల వ్యయంతో రూపొందుతుంటాయి. అలాంటి చిత్రాలు అనుకున్న ప్రకారం విడుదల కాకపోతే ఆ నిర్మాతలకు చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి రాష్ట్రప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే అలాంటి చిత్రాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
మెర్శల్‌పై నిషేధం కొనసాగింపు
మెర్శల్ చిత్ర టైటిల్‌పై నిషేధం కొనసాగుతోంది. విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. శ్రీతేనాండాళ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది. త్వరలో సెన్సార్‌కు వెళ్లనున్న మెర్శల్ చిత్రానికి సమస్యలు మాత్రం తొలగిపోవడం లేదు. ఈ చిత్రం టైటిల్ వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. రాజేందర్ అనే వ్యక్తి తాను మెర్శలాయిటేన్ అనే టైటిల్‌తో చిత్రం చేస్తున్నానని, అందువల్ల మెర్శల్ అనే టైటిల్‌ను విజయ్ చిత్రానికి పెట్టరాదంటూ ఇటీవల మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 3వ తేదీ వరకూ విజయ్ చిత్రానికి మెర్శల్ చిత్ర టైటిల్‌ను వాడకూడదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ కేసు విచారణ బుధవారం మళ్లీ విచారణకు రాగా ఇరుతరఫు వాదనలు విన్న న్యాయస్థానం మెర్శల్ చిత్రం టైటిల్‌పై స్టేను కొనసాగిస్తూ, ఈ నెల 6వ తేదీన తీర్పును వెల్లడించనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment