
అలాంటి ఆశలు లేవు
కోలీవుడ్‌లో ‘కుక్కూ’ చిత్రంతో అందరి దృష్టిని తన వైపు మళ్లించుకున్న అందాల తార మాలవిక నాయర్.
కోలీవుడ్‌లో ‘కుక్కూ’ చిత్రంతో అందరి దృష్టిని తన వైపు మళ్లించుకున్న అందాల తార మాలవిక నాయర్. ఆ చిత్రంలో అంధ యువతిగా, సహజ నటనతో ఆకట్టుకుంది. జాతీయ పురస్కార స్థాయికి మంచి టాక్ తెచ్చుకుంది. కుక్కూ చిత్రం విజయం తర్వాత అమ్మడు తమిళంలో చక్కర్లు కొడతారని అందరూ అనుకుంటే ఆమె మాత్రం చదువుకోవాలి అంటూ సినిమాలకు టాటా చెప్పి ఢిల్లీ వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ నటించడానికి వచ్చింది. అమ్మడు ‘అరసియళ్ల ఇదెల్లామ్ సాధారణమప్పా’ అనే చిత్రంలో యువ హీరో వీరాకు జోడీగా నటిస్తోంది. పచ్చైకిళి ముత్తుచ్చరం, వారణం ఆయిరం, నడునిసి నాయ్‌గల్, రాజతందిరం చిత్రాల్లో వీరా నటించాడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న ‘అరసియళ్ల ఇదెల్లామ్ సాధారణమప్పా’ చిత్రానికి హరికరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
జలందర్ వాసన్ స్క్రీన్ ప్లే చేస్తున్నారు. మెల్ట్ బ్లూస్ బృందం సంగీతం సమకూరుస్తున్నారు. నటించడానికి తిరిగొచ్చిన విషయం గురించి మాలవిక మాటల్లోనే ‘మా కుటుంబంలో అందరూ చదువుకుని మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అందువల్ల నాకు కూడా చదువుపైనే అధిక ఆసక్తి. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలు అన్ని సెలవుల్లో వచ్చి నటించినవే. ‘కుక్కూ’ చిత్రం కూడా పదో తరగతి వేసవి సెలవుల్లో వచ్చి నటించిందే. తర్వాత ప్లస్ వన్, ప్లస్‌టూ తరగతులు ముఖ్యం కావడంతో నటనకు సెలవుపెట్టి చదువుకోవడానికి వెళ్లాను. ఇప్పుడు ప్లస్‌టూ పరీక్షలు ముగించుకుని, ఫలితాల కోసం వేచి ఉన్నా. వేసవి సెలవులు కావడంతో ‘అరసియళ్ల ఇదెల్లామ్ సాధారణమప్పా’ చిత్రంలో నటించడానికి వచ్చాను. సినిమాల వల్ల చదువుకు, చదువు వల్ల సినిమాలకు నష్టం వాటిళ్లని రోజుల్లో మాత్రమే నటిస్తాను. ఇన్ని సినిమాల్లో నటించేయాలి, ఇంత డబ్బు సంపాదించాలని వంటి ఆశలు నాకు లేవు. మనస్సుకు నచ్చిన కథ, పాత్రల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు‘ అంటోంది మాలవిక నాయర్.