ఈ హిట్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు   | Kalyan Ram Devil movie release on december 29th | Sakshi
Sakshi News home page

ఈ హిట్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు  

Published Wed, Dec 27 2023 12:03 AM | Last Updated on Wed, Dec 27 2023 12:03 AM

Kalyan Ram Devil movie release on december 29th - Sakshi

∙‘డెవిల్‌’ సినిమా సీక్వెల్‌కి 50 శాతం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. ‘డెవిల్‌’ కి వచ్చే స్పందన బట్టి సీక్వెల్‌ చేయాలా? వద్దా అనేది ప్రకటిస్తాం. తమ్ముడి (ఎన్టీఆర్‌) ‘దేవర’ సినిమా 85 శాతం షూటింగ్‌ పూర్తయింది. మేం చేసే సినిమాల ఔట్‌పుట్‌ గొప్పగా ఉండాలనుకుంటాం.. అందుకే జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. నేను, తారక్‌ ‘దేవర’ విషయంలో క్లియర్‌గా ఉన్నాం. మేం సంతృప్తి చెందిన వెంటనే సినిమా గురించి అప్‌డేట్‌ ఇస్తాం. అంతేకానీ అప్‌డేట్‌ ఇవ్వాలనే ఒత్తిడితో పని చేయలేం కదా? 

► ‘‘నటుడిగా ఇరవై ఏళ్ల ప్రయాణంలో (మొదటి చిత్రం ‘తొలి చూపులోనే’ – 2003) చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వృత్తిలో చాలా నేర్చుకున్నాను.. వేరే వృత్తిలో అయితే ఇంత నేర్చుకోలేకపోయేవాడినేమో? సినిమాల వల్ల ఎంతోమందితో మాట్లాడటం, పని చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వ్యక్తిగతంగా ఓ మంచి తండ్రిగా, భర్తగా పరిణితి చెందాను’’ అని హీరో కల్యాణ్‌ రామ్‌ అన్నారు.అభిషేక్‌ పిక్చర్స్‌ పై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డెవిల్‌’. కల్యాణ్‌ రామ్‌ హీరోగా, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ చెప్పిన విశేషాలు. 

► 2021లో ‘బింబిసార’ షూటింగ్‌ టైమ్‌లో రచయిత శ్రీకాంత్‌ విస్సా నాకు ‘డెవిల్‌’ కథ చెప్పారు. 1940 బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ కథలో హీరో క్యారెక్టర్‌ కొత్తగా అనిపించింది. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశారా? అని అడిగాను. ‘‘నేను ‘డెవిల్‌’ని కథగానే రాశాను. అభిషేక్‌ నామాగారు మీకు చెప్పమన్నారు. మీరు కమర్షియల్‌ హీరో కదా.. ఇలాంటి కథ ఒప్పుకుంటారా?’’ అని శ్రీకాంత్‌ విస్సా అన్నారు. హీరో క్యారెక్టర్, బ్యాక్‌డ్రాప్‌ అలాగే ఉంచి, కమర్షియల్‌ పంథాలో స్క్రిప్ట్‌లో మార్పులు చేయమన్నాను. శ్రీకాంత్‌ రెండు, మూడు నెలలు సమయం తీసుకుని మార్పులు చేర్పులు చేయడంతో సినిమాప్రారంభించాం.  

► ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలు అందించేందుకు ప్రయత్నిస్తుంటాను. అయితే ఒక్కోసారి వాణిజ్య అంశాలు మిస్‌ అవుతుంటాను. నా గత చిత్రం ‘అమిగోస్‌’కి మరికొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయాలనే ఆలోచన నాకు ఆ రోజు రాలేదు. డైరెక్టర్‌తో మాట్లాడి ఆ పని చేసుండాల్సింది.. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్‌ఫైర్‌ అయిందనుకుంటున్నాను. కానీ, ‘డెవిల్‌’లో వాణిజ్య అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్‌ మూవీలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిక్స్‌ అవడం నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అనుభూతి చెందుతారు. ‘డెవిల్‌’ హిట్‌తో 2023కి వీడ్కోలు పలుకుతామనే నమ్మకం ఉంది.  

► ‘డెవిల్‌’లో నా క్యారెక్టర్‌లో గ్రే షేడ్స్‌ ఉండవు. ప్రతి విషయాన్ని వివరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామాగారు అద్భుతంగా తీశారు. నా అంచనాలకు మించి సౌందర్‌ రాజన్‌గారు విజువల్స్‌ ఇచ్చారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రాజేశ్‌తో 2017 నుంచి వర్క్‌ చేస్తున్నాను. ‘డెవిల్‌’లో నా పాత్ర కోసం దాదాపు 90 కాస్ట్యూమ్స్‌ని వాడాం. నా పాత్రకి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారాయన. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మంచి నేపథ్య సంగీతం అందించారు. ‘బింబిసార’కి కీరవాణిగారిలా ‘డెవిల్‌’ విషయంలో హర్షవర్ధన్‌ న్యాయం చేస్తాడా? అనుకున్నాను. అయితే సినిమా చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది. ‘బింబిసార’ హిట్‌ తర్వాత సంయుక్తా మీనన్‌తో మళ్లీ నటించాను. హీరోకు సమానంగా తన పాత్రకిప్రాధాన్యత ఉంటుంది. మాళవిక పాత్ర కూడా చక్కగా ఉంటుంది. ప్రతి పాత్రకుప్రాధాన్యం ఉంటుంది. 

నేను ఒకే సమయంలో రెండు పడవల ప్రయాణం 
(నటుడు–నిర్మాత) చేయాలనుకోను. నటనకు ఎంత కష్టపడాలో.. నిర్మాణంలో అంతకు మించి కష్టపడాలి. ‘ఓం’ సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. అప్పటి నుంచి మా బ్యానర్‌లో చేసే సినిమాలకు సంబంధించిన సినిమాల కథ మాత్రమే నేను వింటాను. మిగిలిన విషయాలన్నీ మా హరిగారు చూసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement