బీట్... ఒక్క బీట్...హార్ట్ బీట్‌ని పెంచేస్తుంది! నోట్... ఒక్క మాస్ నోట్...మనందరి చేత స్టెప్పులేయిస్తుంది!రూరల్ టు సిటీ... సిటీ టు రూరల్....ఏ రూటులోని థియేటర్‌లోనైనా...ఎంత రేటు పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడినైనా... వయసెంతైనా...స్టెప్పులేయించగల సత్తా... పాడించగల పట్టు... ఐటమ్ పాటకున్న ప్రత్యేకతలు!! మరి, మూడు గంటల సినిమాలో మూడున్నర నిమిషాల ఐటమ్ పాటలోసందడి చేసే భామలు?
చిందేసే చిచ్చుబుడ్డీలు...కనువిందు చేసే కాకర పువ్వొత్తులు...టెన్ థౌజెండ్‌వాలా టపాసులు! సిన్మాలో వీళ్ల వెలుగులు, సౌండులు కాసేపే!కానీ, థియేటర్లను హోరెత్తించే ఈ స్పెషల్ సాంగులు..మాస్ అమ్మా... మాస్!
రత్తాలూ... రైట్ రైట్!
రత్తాలు రాకతో సంక్రాంతి పండక్కి థియేటర్లలో దీపావళి వచ్చేసింది. చిరంజీవి రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘రత్తాలూ... రత్తాలూ’లో చిరూతో కలసి రాయ్ లక్ష్మీ అంతలా రఫ్ఫాడించేశారు మరి! రాయ్ లక్ష్మీ అంతకు ముందు ఎన్ని ఐటమ్ సాంగులు చేసినా... రత్తాలు మాత్రం ఆమెకు, ప్రేక్షకులకూ స్పెషల్! డ్యాన్సులో చిరు గ్రేసు, సాంగులో చిరూతో రాయ్ లక్ష్మీ వేసిన స్టెప్పులు... పట్టాలు ఎక్కిన రైలు వెళ్లేంత స్పీడులో ప్రేక్షకుల చేత స్టెప్పులేయించాయి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి! ఇందులో రత్తాలు హాట్ అప్పియరెన్స్‌కి ప్రేక్షకులు రైట్... రైట్... అని ఓటేశారు.
స్వింగ్ జరా... సెన్సేషన్‌రా!
దీపావళికి నెల ముందు.. సరిగ్గా దసరా టైమ్‌లో... థియేటర్లలో సాలిడ్ సౌండ్ వినబడింది. ఎవరది? అంత సౌండ్ చేసింది? అని చూస్తే... తమన్నా! ఎన్టీఆర్‌తో స్టెప్పులు కలిపారు. థియేటర్లలో ఎవరి సీటుల్లో వాళ్లు కూర్చుంటే... అందరి చేత ‘స్వింగ్ జరా’ సాంగుతో స్టెప్పులేయించారు. కళ్లల్లో కసి, స్టెప్పుల్లో సెక్సీనెస్, ఎన్టీఆర్ రావణతాండవం... వెరసి సాంగ్ సెన్సేషన్! తెలుగు ప్రేక్షకులకు తమన్నా అందాలు కొత్తేం కాదు. ఎన్టీఆర్‌తో కలసి ఆల్రెడీ ఓ సినిమా చేశారు. కానీ, ఈ పాటలో ఇద్దరి కెమిస్ట్రీ సూపరో... సూపరు! అందుకే, పాట అంత హిట్టయ్యింది.
సూయ... సూయ... స్టైలిష్ అనసూయ!
రత్తాలొచ్చిన నెలన్నర తర్వాత థియేటర్లలో నిఖార్సైన నాటు బాంబు పడింది. ఈ నాటు బాంబు పేరు... అనసూయ. రత్తాలు చిరూతో వస్తే... చిరు మేనల్లుడు ‘విన్నర్’ సాయిధరమ్ తేజ్‌తో అనసూయ వచ్చారు. ‘సూయ సూయ అనసూయ’ అని ఆమె పేరుపైనే పాట రాయడం అనసూయకు దక్కిన అరుదైన అదృష్టం. హాట్ యాంకర్ అనసూయ హస్కీ లుక్స్, సెక్సీ స్టెప్పులకు తోడు ప్రముఖ యాంకర్ సుమ పాడడంతో ఈ పాటకు మాంచి క్రేజ్ వచ్చింది. థియేటర్లలో బాగానే సౌండ్ చేసిందీ సాంగ్!
సిరిమల్లి... హాట్ రెడ్ చిల్లి!
లేట్ కాలేదు... నాటు బాంబు వచ్చిన వారం రోజులకు దీవాలి టపాసు వచ్చేసింది. ఈ టపాసు స్టెప్పులకు పోరగాళ్లు ఫుల్ టాస్. ఫుల్ టు బిందాస్! ఈ టపాసు పేరు... హంసా నందిని. అసలే, ఐటమ్ సాంగులకు కేరాఫ్ అడ్రస్ ఈ రెడ్ చిల్లి. ‘మిర్చి’ నుంచి లాస్ట్ ఇయర్ ‘శ్రీరస్తు శుభమస్తు’ వరకు పలు సిన్మాల్లోని ఐటమ్ సాంగుల్లో ఘాటు ఘాటుగా కనిపించారు. ఈ ఏడాది రాజ్‌తరుణ్ ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’లో ‘నా పేరే సింగపూర్ సిరిమల్లి’ అంటూ చిచ్చుబుడ్డిలా వెలుగులు విరజిమ్మారు. పాటలో చెప్పినట్టు హంసా నందిని అందం హాట్ హాట్ రెడ్ చిల్లీనే. కొంటె కుర్రాళ్ల గుండెల్లో లొల్లి లొల్లీనే!
టైమ్ లేదు గురూ... శ్రియ చమక్కులు!
‘టైమ్ లేదు గురూ...’ అంటూ కృష్ణవంశీ ‘నక్షత్రం’లో కనిపించారు శ్రియ. కానీ, అప్పటికి చాలా టైమైంది... తెలుగు తెరపై ఐటమ్ బాంబు పేలి! ఇటువంటి పాటల్లో శ్రియ చమక్కులు చూపించి! మార్చి మొదట్లో హంస హోయలొలికిస్తే... ఆగస్టు ఫస్టు వీక్‌లో శ్రియ సౌండ్ చేశారు. హీరోయిన్లను అందంగా చూపడంలో స్పెషలిస్ట్ అయిన కృష్ణవంశీ, మోడ్రన్ డ్రస్సుల్లో శ్రియను సెక్సీగా చూపించారు. దాంతో
కుర్రకారు హ్యాపీ.ఎ ఫర్ అందగత్తె... సి ఫర్ క్యాథరిన్!
ఎ ఫర్ అందగత్తె. బి ఫర్ బాంబ్... ఐటమ్ బాంబ్! ఎవరు? సి ఫర్ క్యాథరిన్. కావాలంటే... ‘జయ జానకి నాయక’లో ‘ఎ ఫర్ యాపిలు... బి ఫర్ బుజ్జులు’ చూడండి. క్యాథరిన్ చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. గట్టిగానే పేలిందీ బాంబ్. బెల్లకొండ శ్రీనివాస్ మంచి డ్యాన్సర్. అతని పక్కన అందంతో, అదరగొట్టే స్టెప్పులతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేశారు క్యాథరిన్.
స్వీట్ సన్నీ.. ప్యారీ పూజ...రెడీ టు బ్లాస్ట్!
జస్ట్... టూ వీక్స్ వెయిట్ చేస్తే చాలు! థియేటర్లలో ఇంకో ఐటమ్ బాంబు పేలుతుంది. మామూలు బాంబ్ కాదిది.. ఇంటర్నేషనల్ బాంబ్! పేరు... సన్నీ లియోన్. ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని శృంగార తార. వచ్చే నెల 3న థియేటర్లలోకి వస్తున్న రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’లో ఐటమ్ సాంగ్ చేశారు. అది ఏ రేంజ్‌లో పేలబోతుందో... ‘డియో డియో డిసక’ పాట వింటే అర్థమవుతుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన బీట్‌లో మాస్‌ని ఊపేసే ఓ మేజిక్ ఉంది. ఆల్రెడీ నెట్టింట్లో ‘డియో డియో’ ట్యూన్, సన్నీ స్టిల్స్, మేకింగ్ వీడియోస్ హల్‌చల్ చేస్తున్నాయి. ఓన్లీ... ఈ ఒక్క పాటకు కోటి రూపాయలు ఖర్చు పెట్టారట! సన్నీ లేడీ 50 లక్షలు తీసుకుంటే... మేకింగ్‌కి మరో 50 లక్షలు ఖర్చు చేశారు. ఈ పాటను నాలుగు రోజులు తీశారు.
‘‘నా సినిమాల్లో నేను తీసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. అందుకే, ‘ది బెస్ట్’ సాంగ్‌ని ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను’’ అని చిత్రదర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. ఇక, ఐటమ్ సాంగ్‌తో బ్లాస్ట్ చేయడానికి రెడీ అవుతోన్న మరో బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పటివరకు ఈమె ఏ సినిమాలోనూ ఐటమ్ గాళ్‌గా కనిపించలేదు. రామ్‌చరణ్ ‘రంగస్థలం’తో ఆ లోటు తీర్చేస్తున్నారు. çసుకుమార్ సినిమాల్లో ఐటమ్ బాంబులు ఏ రేంజ్‌లో పేలాయో? సుక్కు సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎంత రెచ్చిపోతారో? ప్రత్యేకంగా చెప్పాలా!! సో, ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేయబోయే పాట ఆల్రెడీ హిట్టని ప్రేక్షకులు ఫిక్సయ్యారు!
- సత్య పులగం
Comments
Please login to add a commentAdd a comment