'తిక్క' రివ్యూ
సినిమా : తిక్క
జానర్ : యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెయినర్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, లారిస్సా బోన్సి, మన్నారా చోప్రా, రాజేంద్రప్రసాద్, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం : ఎస్ ఎస్ థమన్
దర్శకత్వం : సునీల్ రెడ్డి
నిర్మాత : రోహిన్ రెడ్డి
మెగా బ్రాండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనదైన ప్రతిభతో అభిమానులను సంపాదించుకుంటున్న హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం వేగంగా మాస్ ఇమేజ్ను సొంతం చేసుకుంటున్న యువ హీరోల్లో తేజు ఒకరని చెప్పొచ్చు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్లతో ఆకట్టుకున్న తేజు.. ఈసారి మాస్ని ఆకర్షించే 'తిక్క' టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ 'తిక్క' లెక్కేంటో ఓ సారి చూద్దాం.
ఆదిత్య(సాయి ధరమ్ తేజ్) అల్లరిగా తిరిగే కుర్రాడు. మందు, అమ్మాయిలు, పార్టీలు, ఎంజాయ్మెంట్.. ఇవే జీవితం అనుకునే టైప్. ఆదిత్య తండ్రి(రాజేంద్రప్రసాద్) అడ్డగోలు పెంపకమే అందుకు కారణం. తన కారుకి యాక్సిడెంట్ చేసిన అంజలి(లారిస్సా బోన్సి)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు ఆదిత్య. వెంటపడి మరీ ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. అంజలి.. ఆదిత్య చేత చెడు అలవాట్లు మాన్పించి జీవితాన్ని దారిలో పెడుతుంది. ఆదిత్య తండ్రి చేత కూడా తాగుడు మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లో చేరుస్తుంది. అంజలి, ఆదిత్యల ప్రేమ రెండేళ్లు సాఫీగానే సాగుతుంది. ఆ తర్వాత కొన్ని కారణాలతో అంజలి ఆదిత్యకు బ్రేకప్ చెబుతుంది. కోపంలో ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా తాగేసిన ఆదిత్య.. ఆ హ్యాంగోవర్లో హంగామా సృష్టిస్తాడు. సిటీలో బ్రేకింగ్ న్యూస్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? తిరిగి అంజలిని కలుస్తాడా లేదా అనేదే మిగిలిన కథ.
చెప్పుకోవడానికి బానే ఉందనిపిస్తున్నా.. చూసేటప్పుడు మాత్రం ఏదో తేడా కొట్టింది ఈ తిక్క. దర్శకుడు ప్రజెంటేషన్లో తడబడిన విషయం మనకు త్వరగానే తడుతుంది. తాగిన మత్తులో ఓ యువకుడు చేసిన తిక్క పనులు చూపించినప్పటికీ.. హైలైట్ చేయాల్సినవాటిని లైట్ తీసుకున్నారు. దాంతో ప్రేక్షకులకు అందాల్సిన, అందించే అవకాశం ఉన్న మెసేజ్ అందకుండానే ఆగిపోయింది. మొదటి అర్ధ భాగమంతా హ్యాంగోవర్లో చేసే ఛేజ్ అయితే, సెకండ్ హాఫ్ అంతా విలన్ గ్యాంగులతో కన్ఫ్యూజన్ కామెడీ. అటు ఛేజ్, ఇటు కన్ఫ్యూజన్.. రెండూ బాగా సాగాయి.
సాయి ధరమ్ తేజ్ సినిమా అంతా ఎనర్జిటిక్గా కనిపించాడు. సినిమాకి అతని ఎనర్జీనే ప్లస్ పాయింట్. ఇక హీరోయిన్ లారిస్సా ఆకట్టుకునేంత అందంగా అయితే లేదు. ఆమెకు చెప్పిన డబ్బింగ్ కూడా పెద్దగా నప్పలేదు. మరో హీరోయిన్ మన్నారా చోప్రాది చాలా చిన్న రోల్. రాజేంద్ర ప్రసాద్, పోసాని, రఘుబాబు, అజయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. బోలెడంతమంది కమెడియన్లు ఉన్నప్పటికీ అక్కడక్కడా తప్ప పెద్దగా చెప్పుకోదగిన కామెడీ పండకపోవడం మైనస్. థమన్ పాటలు ధియేటర్ బయటకొచ్చాక గుర్తుండవు. నిర్మాత పెట్టిన ఖర్చు కళ్లకు చక్కగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 'తిక్క' లెక్క తప్పినట్టుగా ఉంది.
- గీత, ఇంటర్ నెట్ డెస్క్