ఈ కథకు శ్రీనివాస్ యాప్ట్ : బోయపాటి
‘‘కథకి నప్పే హీరోతో సినిమా చేయడం నా అలవాటు. నా దగ్గర శ్రీనివాస్‌కి నప్పే కథ ఉంది కాబట్టే, నా అంతట నేను అడిగాను. ఈ కథకు భారీ బడ్జెట్ అవుతుంది. అందుకే, కథ విన్నాక, తానే నిర్మిస్తానని, బయటి బేనర్లో వద్దని బెల్లంకొండ సురేశ్ అన్నారు. ‘భద్ర’ తరహాలో లవ్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఓ ప్రేమికుడు ఎలాంటి దారిలో వెళ్లాడన్నదే కథ’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేశ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి అర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వినాయక్ ద్వారా హీరోగా పరిచయం కావడం, రెండో సినిమానే బోయపాటి శ్రీనుతో చేయడం తన అదృష్టమని శ్రీనివాస్ అన్నారు. బోయపాటితో మూడు హిట్ చిత్రాలకు పని చేశానని, తమ కాంబినేషన్లో మరో హిట్ ఖాయం అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పారు.
‘అల్లుడు శీను’తో శ్రీనివాస్‌ని వినాయక్ హీరోగా నిలబెట్టారని, ఆ సినిమా విడుదలకు ముందే బోయపాటి సినిమా చేస్తాననడం ఆనందంగా ఉందని బెల్లంకొండ సురేశ్ చెప్పారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించడం ఖాయమని బెల్లంకొండ గణేశ్ అన్నారు. నవంబరులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక. ఓ ప్రత్యేక పాత్రలో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: రత్నం.