ఇలాంటి ప్రేమకథ రాలేదు!
- దాసరి కిరణ్‌కుమార్
‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. కథ గొప్పగా ఉంటే విజయం ఖాయం. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎన్నో వందల, వేల ప్రేమకథలు వచ్చాయి. మేము చేస్తున్న ఈ ప్రేమకథ తరహాలో ఇంతవరకూ ఏదీ రాలేదు’’ అని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ చెప్పారు. హవీష్, అభిజిత్, నందిత కాంబినేషన్‌లో రామదూత క్రియేషన్స్ పతాకంపై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘రామ్‌లీల’. శుక్రవారం సంస్థ కార్యాలయంలో జరిగిన దాసరి కిరణ్‌కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హుద్‌హుద్ తుపాను బాధితులకు మూడు లక్షల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. అనంతరం దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘మలేసియా నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమ, వినోదం, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. ‘దీవానా’లో షారుక్ ఖాన్ చేసిన పాత్ర తరహాలో ఇందులో హవీష్ పాత్ర ఉంటుంది. అభిజిత్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ కథ నచ్చి ఎస్. గోపాల్‌రెడ్డి ఛాయాగ్రాహకునిగా చేయడానికి అంగీకరించారు. ఇప్పటికి 95 శాతం సినిమా పూర్తయ్యింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నా, మాటలు: విస్సు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్, సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి, సారథ్యం: కోనేరు సత్యనారాయణ.