ఏదో శక్తి నడిపించింది!
‘‘నా దృష్టిలో దేవుడికి మతం లేదు. దేవుణ్ణి అనుసరించే వాళ్లకు మతం ఉంటుంది. నేను హిందువు అయినా క్రీస్తుపై తీస్తున్న ఈ చిత్రానికి పాటలు స్వరపరిచే క్రమంలో ఏదో శక్తి నన్ను వెనకుండి నడిపించింది’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత భూమ్మీద 40 రోజులు తిరిగిన ఏసుక్రీస్తు ఏం చేశారనే కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘తొలి కిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ స్వరకర్త. ఇటీవల ఆడియో విడుదలైంది.
ఆయన మాట్లాడుతూ – ‘‘జాన్‌బాబు, సుధాకర్‌లు క్రీస్తు మీద చిత్రమనగానే ఎక్కువ కాలం నిలబడే పాటలు చేయాలనుకున్నా. బైబిల్ పదాలతో కాకుండా వాడుక భాషలోని పదాలతో పాటలు రాయించాను. మారుమూల ప్రాంతాల నుంచి ఓ వంద ఫోనులొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి చర్చి నుంచి ‘తొలి కిరణం’ ఆడియో సీడీలు కావాలని ఫోనులొస్తున్నాయి. ముఖ్యంగా ఎస్పీబీగారు పాడిన శిలువ పాట, నేనూ, సునీత పాడిన ‘శాంతికి దూతగా..’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. నా దర్శకత్వంలో ప్రియమణి ముఖ్యతారగా కన్నడ, తెలుగు సినిమా ‘వ్యూహం’ను ఏప్రిల్ 14న విడుదల చేస్తాం. ప్రస్తుతం రెండు కథలు సిద్ధం చేశాను. వాటిలో నేను నటించను. హీరోలకు వినిపిస్తున్నా. ఓకే అయిన తర్వాత చెబుతా’’ అన్నారు.