షారుక్ గురించి చాలా ఊహించా గానీ..
షారుక్ గురించి చాలా ఊహించా గానీ..
Published Sat, Feb 4 2017 5:02 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
షారుక్ ఖాన్ పేరు వింటే చాలు.. హీరోయిన్లు ఫిదా అవుతారు. ఆయనతో నటించే చాన్సు ఒక్కసారి వస్తే చాలనుకుంటారు. పాకిస్థానీ నటి మాహిరా ఖాన్ కూడా అలాగే భావించింది. రయీస్ సినిమాలో షారుక్ సరసన నటించిన మాహిరా.. ఫొటో షూట్ విషయంలో అతడి గురించి చాలా ఊహించాను గానీ, కాస్త అప్‌సెట్ అయ్యానని చెప్పింది. రయీస్ సినిమాకు తాను సంతకం చేసిన తర్వాత, ఫొటో షూట్ ఉంటుందని చెప్పారని, షారుక్ కూడా వస్తున్నారన్నారని, దాంతో తాను వెంటనే అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్తే.. ఆయన కేవలం హాయ్.. హలోతోనే సరిపెట్టేశారని మాహిరా తెలిపింది. కొంతసేపటి తర్వాత అక్కడ గాలి వీస్తుందని, చుట్టూ ఆకులు రాలతాయని.. ఇలా చాలా చాలా ఊహించాను గానీ అలా ఏమీ జరగలేదని చెప్పింది. బహుశా షారుక్ చేతులు చాచి పిలవని ఏకైక హీరోయిన్ తానే అయి ఉంటానని కాస్తంత బాధపడింది.
వెంటనే దానికి స్పందించిన షారుక్.. ''నువ్వు చాలా చిన్నదానివి.. నేను నిన్ను ఒక పాటలో ఎత్తుకున్నా'' అన్నాడు. షారుక్ ఖాన్‌తో నటించే అవకాశం వచ్చిందనగానే తాను చాలా ఉద్వేగానికి గురయ్యానని, ఆయన సినిమాలు చూస్తూనే తాను నటిగా ఎదిగానని మాహిరా తెలిపింది. ముంబైలో అడుగుపెట్టగానే తన దుపట్టా గాల్లో ఎగురుతూ వెళ్తుందని, షారుక్ తనవైపు పరుగున వస్తారని అనుకున్నాను గానీ అలా ఏమీ జరగలేదని చెప్పింది. దాంతో, ''ఇప్పుడు నువ్వు ఒకరకంగా నా వయసు ఎంతన్న విషయం అందరికీ చెప్పేస్తున్నావు. దుపట్టా సీన్ మనకు గుజరాత్‌లో ఉంది.. బడ్జెట్ ఎక్కువ లేదు కాబట్టి అలా చేశారు గానీ, లేకపోతే స్విట్జర్లాండ్‌లో తీసేవాళ్లం'' అని షారుక్ జోకు పేల్చాడు. హిందీ సినిమాలో డాన్సు చేస్తూ, ముఖంలో భావాలు కూడా పలికించడం తనకు చాలా కష్టమైందని మాహిరా చెప్పింది.
Advertisement
Advertisement