మా సెట్లో ఆడా మగా తేడా లేదు | Tollywood Actress Charmi Interview her birth day special | Sakshi
Sakshi News home page

మా సెట్లో ఆడా మగా తేడా లేదు

Published Fri, May 17 2019 12:09 AM | Last Updated on Fri, May 17 2019 10:58 AM

Tollywood Actress Charmi Interview her birth day special - Sakshi

చార్మి

‘నీ తోడు కావాలి’ అంటూ ఏ తోడూ లేకుండా హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరి అండా లేకుండానే సక్సెస్‌ అయ్యారు. చార్మింగ్‌ బ్యూటీనే కాదు.. చాలా మంచి ఆర్టిస్ట్‌ అని కూడా అనిపించుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా పలు భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన చార్మి ఇప్పుడు తనలోని నటిని సెకండ్‌ సీట్లో కూర్చోబెట్టారు. నిర్మాతను ఫ్రంట్‌ సీట్‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రొమాంటిక్‌’ చిత్రాల నిర్మాణంతో బిజీగా ఉన్నారు. నేడు చార్మి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెతో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...

► బర్త్‌డేకు స్పెషల్‌ ప్లాన్స్‌ ఏమైనా ఉన్నాయా?
ప్లాన్స్‌ ఏం లేవు. గోవాలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. మొన్న రామ్‌ బర్త్‌డేకు రిలీజ్‌ చేసిన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అదే బర్త్‌డే సెలబ్రేషన్స్‌ అన్నట్టు.

► బర్త్‌డేకు కొత్త నిర్ణయాలేమైనా తీసుకుంటారా?
అలాంటివి ఎప్పుడూ పెట్టుకోను. ప్రస్తుతం ఫోకస్‌ అంతా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మీదే ఉంది. బోలెడు పనులున్నాయి. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయాలి, బిజినెస్‌ చూసుకోవాలి. మైండ్‌ మొత్తం సినిమా చుట్టూనే తిరుగుతోంది.

► ప్రొడ్యూసర్‌గా ఫుల్‌ బిజీగా ఉన్నట్టున్నారు. ఫీమేల్‌ ప్రొడ్యూసర్స్‌కు షూటింగ్‌ స్పాట్‌లో ఉండే చాలెంజెస్‌ ఏంటి?
మా సెట్లో స్త్రీలు, పురుషులు అనే తేడాని ఎప్పుడూ ఫీల్‌ అవలేదు. మా పీసీ (పూరీ కన్సెక్ట్స్‌) ఆఫీస్‌లో కూడా ఆ వ్యత్యాసాలేమీ ఉండవు. నేను మ్యాన్‌లా ఆలోచిస్తానని, మ్యాన్‌లా ఉంటానని అలానే వర్క్‌ చేస్తానని పూరీగారు చెబుతుంటారు– ఇక్కడ మొత్తం ఫ్రెండ్లీ వాతావరణమే ఉంటుంది. నేను బాస్, నువ్వు ఎంప్లాయ్‌.. అలా ఉండదు. ఇక్కడ అందరూ పనికోసమే వస్తారు, పని మాత్రమే చేస్తారు.  ఫోకస్‌ పనిమీద మాత్రమే ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉండవు.

► హీరోయిన్‌గా ఉన్నప్పుడు మీకు అన్నీ టైమ్‌కు ఏర్పాటు చేస్తుంటారు. మీరు ప్రొడ్యూసర్‌ అయిన తర్వాత మీ హీరోహీరోయిన్లను ఎలా చూసుకుంటున్నారు?
నేను మా హీరోహీరోయిన్లను చాలా గారం చేస్తుంటాను. నాకు గారం చేయడం అంటే భలే ఇష్టం. హీరోగారు వస్తున్నారు.. అంతా రెడీ పెట్టండి. హీరోయిన్‌కి వ్యాన్‌ రెడీ ఉందా? ఇలా అన్నీ చూసుకుంటాను. యూనిట్‌ వాళ్లకు ఫుడ్‌ సెర్వ్‌ చేస్తుంటాను. అందరూ సరదాగా రావాలి, కలసి నవ్వుకుంటూ పని చేయాలి. ఇదే మా పాలసీ.

► గారం చేస్తే షూటింగ్‌ లేట్‌ అయ్యే చాన్స్‌ కూడా ఉంటుంది కదా?
అస్సలు ఉండదు. వాళ్లు మార్నింగ్‌ నిద్ర లేవగానే వర్క్‌కి రావాలంటే ఒక ఉత్సాహంతో ఉండాలి. మనం ఇక్కడ బాగా చూసుకుంటే వాళ్లూ అలానే పని చేస్తారు. అబ్బా.. ఇవాళ షూటింగ్‌కి రావాలా? అని బాధపడుకుంటూ రారు. ఆ ఎనర్జీతో వస్తే చాలు.. జరగాల్సిన పనులు టైమ్‌కు జరిగిపోతుంటాయి. మేం డిఫరెంట్‌ కండీషన్స్‌లో షూట్‌ చేయాల్సి ఉంటుంది. వారణాసిలో షూట్‌ చేసినప్పుడు 47 డిగ్రీల ఎండ. డైరెక్ట్‌ సన్‌లైట్‌ కింద పనిచేశాం. అందరికీ సన్‌ ఎలర్జీతో బ్లాక్‌ ప్యాచ్‌లు వచ్చేశాయి. కానీ ఎవ్వరూ కంప్లైంట్‌ చేయలేదు. ఇదో చాలెంజ్‌ అన్నట్లు తీసుకొని పని చేశాం.

► హీరోయిన్‌గా ఉన్నప్పుడు సెట్లో ఏదైనా మార్పు వస్తే బావుండు అనుకున్నది నిర్మాతగా మారిన తర్వాత తీసుకొచ్చింది ఏదైనా ఉందా?
ఏదో మార్పు తీసుకు రావడానికో, మార్చడానికో మనం ఇక్కడం లేం. మా లక్ష్యం సినిమాలు చేయడమే. మంచి సినిమాలు చేయాలి, హిట్స్‌ కొట్టాలి. ఈ జర్నీ జరిగేటప్పుడు అందరూ హ్యాపీగా, ఇబ్బంది లేకుండా ఉండాలి. అంతే.

► నిర్మాతగా మారిన తర్వాత ఎలా ఉంది?
అమ్మలా మారినట్టు ఉంది. సినిమా చేయడం బేబీ క్యారీ చేయడంలానే. ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అయినప్పటినుంచి డెలివరీ వరకూ జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్మాత అంటే ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అయిన దగ్గర నుంచి మనం అందులో భాగం అయ్యుంటాం. హీరోయిన్‌గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్‌ మొత్తం సెట్‌ అయిన తర్వాత మధ్యలో ఎంటర్‌ అవుతాం. అప్పటికే టీమ్‌ అంతా ఫిక్స్‌ అయ్యుంటుంది. అలాగే రేపు రిలీజ్‌ ఉందంటే ఇవాళో నాలుగు, రేపో నాలుగు ఇంటర్వ్యూలు ఇస్తే చాలు. సినిమా ప్రమోషన్‌కు వారం రోజులు కేటాయిస్తే చాలు అని ఉంటుంది.

హీరోయిన్‌గా ఉన్నప్పుడు 6–7 రిలీజ్‌లు ఉండేవి. ప్రతి సినిమా  హిట్‌ అవ్వాలనుకుంటాం. ప్రతీ ప్రాజెక్ట్‌ మీద ప్రేమ ఉన్నా అది ఒక్కోదానికి షేర్‌ అవుతుంది. నిర్మాతగా ఉన్నప్పుడు మన ఎనర్జీ, రక్తం, చెమట అన్నీ ఇందులోనే పెడతాం. కొన్నిసార్లు టెన్షన్‌తో నిద్ర పట్టదు. రేపు ఏం చేయాలి? అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయా? వంటి ఆలోచనలతో సతమతమవుతుంటాం. టెన్షన్‌ అయితే కచ్చితంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఉంటుంది. దానికి తోడు కాన్ఫిడెన్స్‌ కూడా ఉంటుంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’  సినిమా మీద అయితే చాలా నమ్మకంగా ఉన్నాం.

► పూరీగారు ఓ సాలిడ్‌ హిట్‌ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్‌ అంతా చూస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఎలా ఉండబోతోంది?
100 పర్సంట్‌... రాసిపెట్టుకోండి. పూరీగారి దగ్గర నుంచి ఇన్నాళ్లూ ఏదైతే మిస్‌ అయ్యారో, ఏదైతే కోరుకుంటున్నారో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ దానికి మించి ఉండబోతోంది. కావాలంటే రాసిస్తాను.

► మళ్లీ మిమ్మల్ని స్క్రీన్‌ మీద ఎప్పుడు చూడొచ్చు?
నెవ్వర్‌ సే నెవర్‌ అంటారు. నటిగా మళ్లీ స్క్రీన్‌ మీద కనిపించడానికి చాలా టైమ్‌ ఉంది.  రాబోయే కొన్ని సంవత్సరాలు మొత్తం పూరీ కనెక్ట్స్‌లోఎలాంటి సినిమాలు చేయాలి? అనే దానిమీదే దృష్టంతా. కొత్త కొత్త స్క్రిప్ట్స్‌ రెడీ అవుతున్నాయి. అందుకే యాక్టింగ్‌ కొన్ని రోజులు సెకండ్‌ సీట్‌లోనే ఉండబోతోంది.

► హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎంజాయ్‌ చేశారా? నిర్మాతగా ఉండటాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారా?
నిర్మాతగా ఉండటం చాలా స్ట్రెస్‌ఫుల్‌. చాలా టఫ్‌. ఇందాక అన్నట్టు టెన్షన్, నిద్రలేని రాత్రులు. కానీ నిర్మాతగా ఉండటాన్నే ఎంజాయ్‌ చేస్తున్నాను. మనం ఏం చేసినా జీవితంలో సమస్యలు కామన్‌. వాటి పరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్‌. సమస్యలను ఎవరైనా పరిష్కరించుకోవాల్సిందే కదా. నేను అది బాగా చేసుకోగలను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement