లుక్కు... కిక్కు... | Tollywood Movies First Look Posters Special Story | Sakshi
Sakshi News home page

లుక్కు... కిక్కు...

Published Wed, Sep 4 2019 8:50 AM | Last Updated on Wed, Sep 4 2019 8:50 AM

Tollywood Movies First Look Posters Special Story - Sakshi

నాగచైతన్య వెంకటేశ్‌ ,చిరంజీవి

ఏ పండగకైనా సినిమా లవర్స్‌ తాజా చిత్రాల అప్‌డేట్స్‌ని ఆశిస్తారు. అలా ఈ వినాయక చవితి పండగ వారికి బాగానే కిక్‌ ఇచ్చింది. స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల సినిమాల వరకూ కొత్త లుక్, కొత్త పోస్టర్‌ లేదా ట్రైలర్‌.. ఇలా ఏదో ఒక అప్‌డేట్‌ ఇచ్చారు. కొందరైతే రిలీజ్‌ టైమ్‌ని  కూడా ప్రకటించారు. అభిమాన తారల కొత్త లుక్, అప్‌డేట్‌ అభిమానులను ఖుషీ చేశాయి. ఇక కొత్త లుక్స్‌పై లుక్కేద్దాం...

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మించారు. ఆల్రెడీ టీజర్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ విడుదల చేసిన పోస్టర్స్‌లో చిరు పోరాడుతున్న లుక్సే ఎక్కువగా ఉన్నాయి. కానీ వినాయక చవితి రోజున కూల్‌గా ఉన్న వెండితెర ఉయ్యాలవాడ ఫొటోను విడుదల చేశారు. అక్టోబరు 2న ఈ సినిమా విడుదల కానుంది. తన కొత్త చిత్రంలో అదిరిపోయే గెటప్‌లో కనిపించారు బాలకృష్ణ. ఈ సినిమాకు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్‌  చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. పండగ సందర్భంగా రెండు కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రూలర్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక పండక్కి సంప్రదాయబద్ధంగా పంచెకట్టులో కనువిందు చేశారు మామాఅల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య. ‘వెంకీమామ’ సినిమాలో ఈ ఇద్దరూ మామాఅల్లుళ్లుగానే నటిస్తున్నారు. కేఎస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. రైస్‌మిల్‌ ఓనర్‌గా వెంకటేశ్, ఆర్మీ ఆఫీసర్‌గా నాగచైతన్య కనిపిస్తారని టాక్‌. డి. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. మమ్మమ్మాస్‌ అంటూ మాస్‌ రాజా రవితేజ కూడా పండగ నాడు అదిరిపోయే స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. క్రిస్మస్‌కు థియేటర్స్‌లో డిస్కో చేయడానికి రెడీగా ఉండమన్నారు. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

డిసెంబరు 20న సినిమా విడుదల కానుంది. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌: కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ సినిమా కోసం లాయర్‌ అవతారం ఎత్తారు సందీప్‌ కిషన్‌. లాయర్‌గా సందీప్‌ వాదన ఎంత బలంగా ఉంటుందో వచ్చే నెలలో వెండితెరపై చూడొచ్చు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపా జగదీష్‌ నిర్మిస్తున్నారు. అక్టోబరులో సినిమా విడుదల కానుంది.  ఇక వరుణ్‌ తేజ్‌ ‘వాల్మీకి’గా రానున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. రానున్న దీపావళికి థియేటర్స్‌లో నవ్వుల బాంబ్‌ పేలనుంది. ఎందుకంటే ‘బంగారు బుల్లోడు’గా ‘అల్లరి’ నరేశ్‌ నవ్వుల బాంబ్స్‌ పేల్చడానికి రెడీ అయ్యారు. అల్లరి నరేశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. పీవీ గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ ఎంత అద్భుతంగా నటించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘రాణి శివగామి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. రమ్యకృష్ణే టైటిల్‌ రోల్‌ చేస్తున్నట్లున్నారు. ఈ సినిమాలో ఆమె తాజా లుక్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని ఎమ్‌. మధు దర్శకత్వంలో డి. మురళీకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్‌ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘జైసేన’. శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్‌ గౌతమ్‌ కీలక పాత్రధారులు. వి. విజయలక్ష్మీ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌ సాంగ్, టైటిల్‌ సాంగ్‌ను నాగబాబు విడుదల చేశారు. ‘‘పాట చూసినప్పుడు యూత్‌ అండ్‌ పొలిటికల్‌ మూవీ అనిపించింది. సినిమా అందరికీ పేరు తీసుకురావాలి’’ అని నాగబాబు అన్నారు. శిరీష్‌ రెడ్డి, శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్‌ ఈ సినిమాకు సహ–నిర్మాతలు. ‘చిత్రం’ శీను, పూజా చౌరసియా, నవల్‌ ఆనంద్‌ పిళ్ళై, మితిలేష్‌ తివారి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘ఉత్కంఠ’. అఖిల్‌–నిఖిల్‌ సమర్పణలో ప్రవీణ్, మనోజ్‌ నిర్మించిన ఈ సినిమాకు చంద్రశేఖర్‌ ఆజాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాబు వెల్లూరు సహ–నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు బాబీ విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. నవంబరు మొదటి వారంలో వెండితెరపై ‘బ్యాచిలర్‌ పార్టీ’ చూడబోతున్నాం. భూపాల్, అరుణ్, ప్రియాంక, సంజన హీరోహీరోయిన్లుగా డి. రామకృష్ణ దర్శకత్వంలో డి సుబ్బారావు, శ్రీనివాస్‌ సంపంగి నిర్మించిన చిత్రం ‘బ్యాచిలర్‌ పార్టీ’. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఇది ఓ వెరైటీ యాక్షన్‌ చిత్రం. అన్ని కమర్షియల్‌ హంగులు ఉంటాయి. నిర్మాతలు మంచి సహకారం అందించారు. నవంబరు మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రామకృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement