సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. ప్రముఖ నిర్మాత, అగ్ర హీరోల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా సినిమాలు నిర్మించిన ప్రొడక్షన్ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హీరో ‘విక్టరీ’ వెంకటేశ్ నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు. పుప్పాలగూడ లోని డాలర్ హిల్స్‌లో ఉన్న వెంకటేశ్ నివాసంలో ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్, ఎంసీహెచ్‌ఆర్‌డీ సమీపంలోని హీరో నాని కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. హీరోల ఆడిటర్లను దగ్గర ఉంచుకుని అధికారులు ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు.
సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యయాలు వార్షిక ఆదాయాల్లో లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ సోదాలపై మీడియా హడావుడి చేయాల్సిన అవసరం లేదని, ఇవన్ని సాధారణంగా జరిగే తనిఖీలేనని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. (చదవండి: రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు)
Comments
Please login to add a commentAdd a comment