ఒక స్టార్ హీరోను తెరపై చూస్తేనే... అభిమానులు ఆగలేరు. ఇక ఇద్దరు హీరోలు కలిసి ఒకే తెరను పంచుకుంటే.. దానికొచ్చే కిక్కే వేరప్ప. గెస్ట్ అప్పియరెన్స్‌గా ఒక హీరో సినిమాలో మరో హీరో కనిపిస్తేనే ఆ సినిమాకు ఎక్కడాలేని హైప్ వస్తుంది. అలాంటిది ఇద్దరు స్టార్‌లను కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి.
ఒకప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు స్కోప్ ఎక్కువగానే ఉండేది. మారిన పరిస్థితులు, అభిమానుల తీరుతో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ అనే కాన్సెప్ట్ కొంతకాలం పాటు కనుమరుగైంది. ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ-శోభన్ బాబులు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలను చేశారు. అయితే 90వ దశకాన్ని ఏలిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు మాత్రం మల్టీస్టారర్ మూవీస్‌ను చేయలేకపోయారు. ఇక ముందు చేస్తారేమో చెప్పలేం.
ఆ నలుగురు హీరోల్లో ఇద్దరు మాత్రం పంథా మార్చుకుని మల్టీస్టారర్ సినిమాలకు ఓకే చెబుతున్నారు. మల్టిస్టారర్ మూవీస్ అంటే ముందుగా వెంకటేష్ వైపు చూస్తున్నారు దర్శకులు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మొదలైన మల్టీస్టారర్ హవా.. మళ్లీ మెల్లగా ఊపందుకుంటోంది. వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా చేసిన ఈ సినిమా విజయవంతమైంది. ఆ తరువాత వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబోలో గోపాల గోపాల మూవీ వచ్చింది. అది కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది.
ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల జోరు కొనసాగుతోంది. నాగార్జున కూడా మరో హీరోతో తెరను పంచుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కార్తీతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించిన నాగ్.. ప్రస్తుతం నానితో కలిసి ‘దేవదాస్’ సినిమాను చేస్తున్నారు. వెంకటేష్-నాగచైతన్య కలిసి ‘వెంకీ మామ’, వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబోలో ‘ఎఫ్2’, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. నితిన్-శర్వానంద్ మల్టీస్టారర్ కూడా రాబోతున్నట్లు సమాచారం.
ఇక రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ టాలీవుడ్‌లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాలి. మెగా-నందమూరి అభిమానులను సంతృప్తిపరిచేలా జక్కన్న కథను సిద్ధం చేయిస్తున్నట్లు వినికిడి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో తెరకెక్కించే ఈ మల్టీస్టారర్‌ను జాతీయ స్థాయిలో రూపొందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీ అనగానే రాజమౌళి రూపోందించే ఈ సినిమా వైపే చూస్తున్నారు సినీజనాలు. బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ కాంబోలో సినిమా ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. ఇప్పటికే ఈ సినిమా కథపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఈ భారీ మల్టీస్టారర్ సినిమా తరువాత టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు రావొచ్చని, రావాలని కోరుకుంటూ.. తెలుగు సినీ పరిశ్రమ స్థాయి ఇంకా పెరగాలని ఆశిద్దాం.
- బండ కళ్యాణ్
Comments
Please login to add a commentAdd a comment