‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని ఓ సినిమా కవి అన్నారు. ఇది లక్ష ప్రమిదల వెలుతురులాంటి నిజం. దీపావళి అంటేనే సంతోషాల సంరంభం. పెద్దవాళ్లు కూడా తమ వయసు మరచిపోయి టపాసులు కాలుస్తూ ఆనంద సాగరంలో మునిగి తేలుతారు. మరి... మన అభిమాన తారల దీపావళి సంరంభం ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకుందాం...
అప్పట్నుంచీ టపాసులు కాల్చడం మానేశాను - నాగార్జున
నాకెందుకో చిన్నప్పట్నుంచీ టపాసులు కాల్చడం అంత ఆసక్తి అనిపించేది కాదు. కానీ, ఫ్రెండ్స్ అందరూ కాలుస్తుంటే నేనూ కొన్ని కాల్చేవాణ్ణి. ఇప్పుడైతే టపాసుల జోలికి అస్సలు వెళ్లడంలేదు. ముఖ్యంగా పర్యావరణం మీద అవగాహన పెరిగిన తర్వాత టపాసులు కాల్చకపోవడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయాను. దీపావళినాడు శబ్ద కాలుష్యం ఎక్కువ. అందుకే, శబ్దం రాని టపాసులతో సరిపెట్టుకోవాలి. అయితే, దీపావళి పండగ వల్ల కూడా ప్లస్సులున్నాయి. టపాసులు కాల్చడం వల్ల దోమల బెడద తగ్గడం ఓ ప్లస్ (నవ్వుతూ). ఈ దీపావళిని అందరూ ఎంజాయ్ చేయాలని, అందరికీ శుభం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
ఒకప్పుడు సందడే సందడి - అనుష్క
అసలు సిసలైన పండగ సంబరం కొత్త బట్టల ద్వారా వస్తుంది. చిన్నప్పుడైతే కంపల్సరీగా కొత్త డ్రెస్ కొనుక్కునేదాన్ని. ఉదయం తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని సందడి చేసేదాన్ని. ఫ్రెండ్స్‌తో పోటీపడి టపాసులు కాల్చేదాన్ని. ఇప్పుడు అంత ఆసక్తి లేదు. ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే చూడటమే తప్ప పెద్దగా సెలబ్రేట్ చేసుకోను. ఇప్పుడు ఒకేసారి బాహుబలి, రుద్రమదేవిలాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాను కాబట్టి... నాకెందుకో దీపావళి ముందే వచ్చేసిందనిపిస్తోంది. ఈ పండగను అందరూ ఎంజాయ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ప్లీజ్... శబ్దం రాని టపాసులు కాల్చండి - త్రిష
దీపాల పండగ అంటే నాకు చాలా సరదా. దీపాలు పెట్టడం, కొత్త బట్టలు వేసుకోవడం, స్వీట్లు తినడం, పంచడం... నా సెలబ్రేషన్ ఇలానే ఉంటుంది. టపాసులు కాల్చను. ఎందుకంటే, వాటి శబ్దానికి అభం శుభం తెలియని మూగ జీవాలు బెదిరిపోతున్నాయి. సౌండ్ వినపడగానే నా బుజ్జి కుక్క బెదిరిపోవడం స్వయంగా చూశాను. అందుకే, మూగజీవాలను దృష్టిలో పెట్టుకుని, శబ్దం రాని టపాసులు కాల్చండి ప్లీజ్. నేనైతే నా పప్పీకి శబ్దాలు అంతగా వినిపించకుండా ‘ఇయర్ మఫ్స్’ ఏర్పాటు చేశాను. జంతువుల క్షేమం గురించి ఆలోచించడానికి ‘యానిమల్ లవర్’ అయి ఉండాల్సిన అవసరం లేదు. హ్యూమన్ బీయింగ్ అయితే చాలు. మూగప్రాణులను ఇబ్బందులపాలు చేయొద్దు.
అయినా... ఆ సరదా మానుకోలేదు - వెంకటేష్
చిన్నప్పుడు నాకు దీపావళి అంటే చాలా సరదా. బీభత్సంగా టపాసులు కాల్చేవాణ్ణి. ఇదిగో ఈ చెయ్యి చూశారు కదా. ఈ మచ్చ నా ఆరేళ్ల వయసులో పడింది. దీపావళి పండగ మిగిల్చిన గుర్తు ఇది. ఆ వయసులో అంత పెద్ద దెబ్బ తగిలినా ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు నా సరదాని మానుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం పొల్యూషన్ అంటూ... టపాసుల జోలికి దాదాపు వెళ్లడం మానేశాను. నా సంగతెలా ఉన్నా... టపాసులు కాల్చేవాళ్లు మాత్రం జాగ్రత్త సుమా!
ఇది స్పెషల్ దీపావళి - నాని
దీపావళిని చిన్నతనం నుంచి బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి. దాదాపు ప్రతిసారీ ఏదో ఒక దెబ్బ తగిలేది. ఈ దీపావళి మా కుటుంబానికి చాలా స్పెషల్. అంజనాతో నా పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి ఇది. ఈ పండగను అమ్మా నాన్న, అంజనాతో జరుపుకుంటాను. శబ్దం వల్ల పెద్దవాళ్లకి చాలా ఇబ్బంది. అందుకని భూచక్రాలు, మతాబులు... ఇలా సౌండ్ లేని టపాసులు కాల్చాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే, మనం టపాసులు కాల్చడం మొదలుపెట్టిన తర్వాత మొదటి అరగంట జాగ్రత్తగా కాల్చాలనుకుంటాం. ఆ తర్వాత ఆ జాగ్రత్తను మర్చిపోతాం. కానీ, కాలుస్తున్నంతసేపూ జాగ్రత్తగా ఉండాలి.