తెలుగు సినిమా.. ఓ పుష్పక విమానం
భద్రాచలం : తెలుగు సినిమా రంగం పుష్పకవిమానం లాంటిదని సినీ హాస్యనటులు, మాటల రచయిత ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఎంతమందినైనా టాలీవు డ్ ఆదరిస్తుందన్నారు. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాల ముగింపు రోజు ఆదివారం సన్మానగ్రహీతగా వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘రెండున్నర గంటల ఎంటర్‌టైన్‌మెంటు కోసం టికెట్ కొనుక్కొని వచ్చే ప్రేక్షకులను నవ్వించాల్సిన బాధ్యత మాపై ఉంది. సినిమా చూసి నీతులు నేర్చుకునే రోజుల పోయాయి. సినిమాకు, సమాజంలోని వాస్తవ పరిస్థితులకు చాలా తేడాలుంటాయి. కాలానుగుణంగా సినిమా కథలు కూడా కమర్షియల్‌గానే ఉంటున్నాయి.
150 సినిమాలు తీస్తే వాటిలో 15 సినిమాలే ఆడుతున్నాయి. అయితే హిట్...లేకుంటే ఫట్ అవుతున్నాయి. తెలుగులో ఉన్నంత మంది హాస్యనటులు మరే భాషలోనూ లేరు. బ్రహ్మానందం మొదులుకొని ధనరాజ్ వరకు 40 మంది మేటి కమేడియన్‌లు ఉన్నారు. హాస్యంలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రేక్షకులను కడుపార నవ్వించేందుకు ఇంత మంది హాస్య నటులను పూర్తిస్థాయిలో వాడుకొనే పరిస్థితులు లేవు. చిన్న సినిమాల్లో అటువంటి అవకాశం వచ్చినా అవి ఆడే పరిస్థితి లేదు. నవ్వించే వారు...నవ్వేవారు ఉన్నా ఇద్దర్నీ సంతృప్తి పరిచే అవకాశం తక్కువగా ఉంది.
నేటి సినిమాల్లో మానవీయ సంబంధాలు కనిపించడం లేదు. ‘బొమ్మరిల్లు’లాంటి సినిమాల కోసం ఇంకెనాళ్లు వేచి చూడాలో. మంచి కథలున్న సినిమాలు కూడా రావడం లేదు. ఒకప్పుడు డిగ్రీ స్థాయిలో ప్రేమకథలు వస్తే...నేడు ఇంటర్, టెన్త్, చివరకు తొమ్మిదో తరగతి చదివే వయసులోనూ లవ్ అంటే ఎమిటో చూపించే దుస్థితి వచ్చింది. సినిమా పరిశ్రమకు వచ్చి 26 ఏళ్లయింది. 12 ఏళ్లు రచయితగా, 14 ఏళ్లు రచయిత, నటుడిగా చేశాను. 400 చిత్రాల్లో నటించాను. రచయితగా రెండు, నటుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నా.
నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘చాలా బాగుంది’, అందరినీ ఆలోచింపజేసిన ‘అమ్మో ఒకటో తారీఖు’ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ‘సొంత ఊరు’ ఇటువంటి సినిమాలను నెమరువేసుకోవాల్సిందే. హాస్యం పండించే వారినే తెలుగు సినిమా రంగం ఆదరిస్తోంది. అవకాశాలు వచ్చినప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నంతలో జాగ్రత్త పడి ఆర్థికంగా కూడా నిలుదొక్కుకోవాలి. అప్పుడే కష్టాలకు ఎదురొడ్డి ప్రేక్షకులను కడుపారా నవ్వించగలం.’ అని ఎల్బీ తన సమావేశాన్ని ముగించారు.