కొత్త బాండ్‌గా టామ్ హిడెల్‌స్టన్
జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే. ‘బాండ్.. జేమ్స్ బాండ్’ అంటూ తాము ధైర్యవంతులమని చెప్పుకోవడానికి పిల్లలు బాండ్ పేరుని వాడుకుంటారు. పెద్దలకు కూడా బాండ్ క్యారెక్టర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఇప్పటివరకూ బాండ్ సిరీస్‌లో వచ్చిన ఇరవై నాలుగు సినిమాలూ దాదాపు అందర్నీ ఆకట్టుకున్నాయి. 24వ చిత్రం ‘స్పెక్టర్’, అంతకుముందు వచ్చిన మూడు బాండ్ చిత్రాలు ‘కేసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సోలాస్’, ‘స్కైఫాల్’లో టైటిల్ క్యారెక్టర్‌ని నటుడు డేనియల్ క్రెగ్ అద్భుతంగా పోషించారు.
కానీ, 25వ చిత్రంలో ఆయన నటించరు. ‘ఇక బాండ్ చిత్రాల్లో నటించడం నా వల్ల కాదు. ఆ సినిమాల్లో నటించే కన్నా టోటల్‌గా సినిమాలు మానేయడం బెటర్’ అని స్వయంగా ఆయనే పేర్కొన్న దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు కొన్ని నెలలుగా కొత్త బాండ్‌ని వెతికే పని మీద ఉన్నారు. బాండ్ సిరీస్‌లో వచ్చిన గత రెండు చిత్రాలు ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’లు శామ్ మెండెస్ దర్శకత్వంలోనే రూపొందాయి. 17వ చిత్రం నుంచి 24వ బాండ్ చిత్రం వరకూ బార్‌బరా బ్రోకోలియే నిర్మించారు. 25వ చిత్రానికి టామ్ హిడెల్‌స్టన్ సరిపోతారని ఆమె భావించారట. దర్శకుడికి కూడా అదే అనిపించి, చివరకు టామ్ హిడెల్‌స్టన్‌ని ఎంపిక చేశారని సమాచారం.
35 ఏళ్ల టామ్ ‘థోర్’, ‘ది ఎవెంజర్స్’, ‘మిడ్‌నైట్ ఇన్ ప్యారిస్’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు జేమ్స్ బాండ్‌గా ఎంతమంది హృదయాలు దోచేస్తారో వేచి చూడాలి. బాండ్‌గా సక్సెస్ అయితే, టామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్ప వచ్చు.