
ఫొటో దిగితే...నిశ్చితార్థం అయినట్టేనా?
‘‘పెళ్లంటే నాకిష్టమే. కానీ, అది మనసుకి సంబంధించినది. మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష పేర్కొన్నారు. తమిళ నిర్మాత వరుణ్ మణియన్, త్రిషల నిశ్చితార్థం జరిగిందనే వార్త ఇటీవల ప్రచారమైన విషయం తెలిసిందే. అలాంటిదేం జరగలేదని త్రిష చెబుతూ -‘‘పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన ఎపిసోడ్. ఒకవేళ నాకు నిశ్చితార్థం జరిగితే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం నాకేంటి? అది దాచాల్సిన విషయమేం కాదు కదా.
అలాంటిది హఠాత్తుగా నిశ్చితార్థం కానిచ్చేసి, పెళ్లి చేసుకోవాలని ఎందుకనుకుంటాను? ముందు నా పెళ్లి గురించి నా నిర్మాతల దగ్గర చెబుతాను. అలాగే, నాతో పాటు పని చేస్తున్నవాళ్లకి చెబుతాను’’ అన్నారు. వరుణ్ మణియన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారట కదా? అనే ప్రశ్నకు -‘‘ఇది నాకు, వరుణ్‌కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. రెండు కుటుంబాలకు చెందినది. అందుకని ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఫ్రెండ్‌తో కలిసి ఫొటో దిగినంత మాత్రాన నిశ్చితార్థం అయినట్టేనా? నాకు వరుణ్ మంచి స్నేహితుడు. ప్రస్తుతం నేను చెప్పగలిగేది ఇంతే’’ అన్నారు.