రాజకీయాల్లోకి రా!
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితి ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను కలవరపెడుతోందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వర్గం, పన్నీర్‌సెల్వం వర్గం ఏకమవడం శశికళ వర్గానికి మింగుడుపడని పరిస్థితి. అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తప్పించడంతో ఆమె సోదరుడు, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడానికి సమాయత్తం అవుతున్నారు.
మరో ప్రక్క ప్రధాన ప్రతి ప్రక్షపార్టీ నేత స్టాలిన్ అన్నాడీఎంకే బల నిరూపణకు పట్టుపడుతున్న వైనం, ఇలా తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న తరుణంలో ప్రముఖ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్ సోదరి వివాహం ఈ నెల 27వ తేదీన చెన్నైలో జరిగింది.
ఈ వేడుకకు డీఎంకే నేత స్టాలిన్‌తో పాటు పలువురు రాజకీయనాయకులు, నటుడు రజనీకాంత్, విజయ్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శుభాకాంక్షలు అందించారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బుధవారం విశాల్ నివాసానికి వెళ్లి ఆయన చెల్లెలు ఐశ్వర్యరెడ్డి, ఉమ్మడి క్రిష దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దినకరన్ మాట్లాడుతూ నటుడు విశాల్‌లో నాయకత్వం లక్షణాలు ఉన్నాయని, ఆయన రాజకీయాల్లోకి వస్తే తాను సంతోషిస్తానని పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లోనూ, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించిన విశాల్ రాజకీయ మోహం పుట్టిందనే విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనకు రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేసినా, తాజాగా టీటీవీ దినకరన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీయవచ్చనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది.