రెండూ కళాఖండాలే
ప్రస్తుత సమాజంలో పోటీ అనేది ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి. సినిమా రంగంలో ప్రస్తుతం ఇలాంటి పోటీతత్వమే నెలకొంది. ముఖ్యంగా పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాల విడుదల విషయంలో పోటీ అనివార్యంగా మారుతోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో అజిత్, విజయ్ చిత్రాలు పోటీకి దిగాయి. ప్రస్తుతం కమల్‌హాసన్, రజనీ కాంత్ వంటి దిగ్గజాల తరువాత అంత స్టార్ స్టామినా ఉన్న నటులు అజిత్, విజయ్. చాలా కాలం తరువాత వీరు నటించిన వీరం, జిల్లా చిత్రాలు పోటీ పడ్డాయి. వీటి రిజల్ట్ కోసం చాలా ఆసక్తికరమయిన పరిస్థితి ఎదురైనా అదృష్టవశాత్తు ఈ రెండు చిత్రాలు ప్రజాదరణకు నోచుకున్నాయి. అయితే ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న కోచ్చడయాన్, కమల్‌హాసన్ నటిస్తున్న విశ్వరూపం-2 చిత్రాల మీద అందరి దృష్టి పడింది. ఈ రెండూ ప్రత్యేకమైన కళాఖండాలు కావడం మరో విశేషం.
- న్యూస్‌లైన్ , తమిళ సినిమా
ఆ రెండు చిత్రాల మధ్య పోటీ
ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన విషయం రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్, కమ ల్ హాసన్ నటిస్తున్న విశ్వరూపం-2, చిత్రాలు ఒకేసారి తెరపైకి రానున్నాయన్నదే. ఈ రెండు చిత్రాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కోలీవుడ్‌కు పరిచయం చేయనున్నాయి.
క్యాప్చరింగ్ టెక్నాలజీతో
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ అద్భుత విజువల్ ట్రిట్‌గా ఉండబోతోంది. క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్‌లో వండర్స్ క్రియేట్ చేయనున్న తొలి భారతీయ సినిమాగా కోచ్చడయాన్ నమోదు కానుంది. హాలీవుడ్ తరహాలో అవతార్, టిన్‌టిన్ చిత్రాల తరువాత అద్భుత సృష్టి గా కోచ్చడయాన్ ఉంటుందంటున్నారు. చిత్ర దర్శక నిర్మాతలు ఎందిరన్ తరువాత రజనీకాంత్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చారిత్రక, పౌరాణిక కథా చిత్రం కోచ్చడయాన్. రజనీ రెండవ కూతురు సౌందర్య అశ్విన్ దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం భారతీయ సిని మా స్థాయిని మరింత పెంచుతుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. యూకేలోని అత్యంత ఆధునిక టెక్నాలజీ గల స్టూడియోలలో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం కోచ్చడయాన్. తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, భోజ్‌పూరి, బెంగాలీ, పంజాబ్ మొదలగు భాషలతోపాటు ఆంగ్లంలోనూ ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన చిత్ర ఆడియోను ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.
సెల్యులాయిడ్ థ్రిల్లర్ విశ్వరూపం - 2
విశ్వనటుడుగా పేరుగాంచిన పద్మభూషణ్ కమల్‌హాసన్ కెరీర్‌లో మరో అద్భుత సృష్టిగా నిలిచిపోయే చిత్రం విశ్వరూపం - 2. ఇంతకు ముందు కమల్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన విశ్వరూపం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా వెండితెర ఆవిష్కరణే విశ్వరూపం -2 అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఎప్పుడూ చాలా అడ్వాన్స్‌డుగా ఉండే కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని ఆధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దుతున్నారు. విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న విశ్వరూపం 2 తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో ఆండ్రియా, పూజా కుమార్, వహిదా రెహ్మాన్, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
గీబ్రాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని కమల్‌హాసన్ ఇటీవల వెల్లడించారు. చిత్రాన్ని మరో మూడు నెలల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో విశ్వరూపం-2 కూడా ఏప్రిల్‌లోనే తెరపైకి రానున్నట్లు సమాచారం. కోచ్చడయాన్, విశ్వరూపం-2 చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా తమిళ ఉగాదిని పురస్కరించుకుని ఒకే సారి తెరపైకి వచ్చే అవకాశం ఉందా? ఒక వేళ అలాంటి సందర్భమే కనుక ఎదురయితే థియేటర్ల యాజమాన్యాలు ఒప్పుకుంటాయూ? లాంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నారుు.
ఏప్రిల్ పైనే అందరి కళ్లు
సంక్రాంతి చిత్రాల క్రేజీ తగ్గుతుంటే, ఏప్రిల్లో విడుదలయ్యే చిత్రాలపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇందుకు కారణం నట దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాలు విడుదల కావడమే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్, కమల్‌హాసన్ విశ్వరూపం-2 చిత్రాలు ఏప్రిల్‌లో విడుదలకానున్నారుు. వీరు కోలీవుడ్‌కు రెండు కళ్లు లాంటివారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమాన బలం ఉన్న కళామతల్లి ముద్దు బిడ్డలు వీరు. అలాంటి నటుల చిత్రాలు పోటీ పడి చాలా కాలం అయ్యింది.
ఆ ఇద్దరి కలయికే
కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు కమల్, రజనీ కలిసి నటించినవే. దీంతో కమల్, రజని కలయికలో చిత్రం వస్తుందంటేనే అంచనాలు తారాస్థాయికి చేరేవి. చిత్ర నిర్మాణ వ్యయం భారీగానే పెరగడంతో కమల్, రజనీ ఇకపై కలిసి నటిం చరాదనే నిర్ణయానికొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమల్, రజనీ కాంబినేషన్‌లో చిత్రం తీయాలని చాలా మంది విశ్వప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. వారి గురువు కె.బాలచందర్‌కి కూడా ఇలాంటి కోరిక బలంగా ఉంది. కానీ ఇది సాధ్యపడే విషయం కాదనిపిస్తోంది.