చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మత విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి ఆయన బీజేపీకి మిత్రుడిగా సరిపోతారనీ నటుడు కమల్ హాసన్ సోమవారం అన్నారు. రాజకీయ ప్రవేశంపై తనను, రజనీని పోల్చడం సరికాదన్నారు. తానో హేతువాదిననీ, తమిళనాడులో అచ్చే దిన్ (మంచిరోజులు) లేవనీ, ఇతర రాష్ట్రాల గురించి తాను మాట్లాడబోనంటూ కమల్ పరోక్షంగా తాను బీజేపీకి దూరమనే సంకేతాలనిచ్చారు.
తన రంగు కాషాయం మాత్రం కాదంటూ ఆయన గతంలోనూ వ్యాఖ్యానించడం తెలిసిందే. రాష్ట్రంలోని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఏంకే, అన్నాడీఎంకేకు పోటీగా ఈ ఏడాదిలోపు కొత్త పార్టీని స్థాపిస్తానని కమల్ చెప్పారు. కులతత్వం, అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం ఉంటుందనీ, పార్టీ స్థాపన గురించి ప్రస్తుతం వివిధ వ్యక్తులతో మాట్లాడుతున్నానని కమల్ పేర్కొన్నారు.