
సాక్షి, బెంగళూరు: రాజకీయాల్లోకి వస్తున్నట్లు సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటకలో సైతం ఆయన ప్రచారానికి వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ పెట్టబోయే రజనీ... తమిళనాడులో బీజేపీతో మైత్రి ఏర్పాటు చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ కాషాయానికి మద్దతుగా ప్రచారం చేసేందుకు వస్తారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తలైవాకు మంచి సంబంధాలే ఉన్నాయి.
రజనీ త్వరలోనే పార్టీ ఆరంభిస్తే ఆయనతో తాము పొత్తు పెట్టుకోవాలని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా రజనీని రంగంలోకి దించాలని బీజేపీ కర్ణాటక శాఖ నాయకులు చెబుతున్నారు. ఆయన ఒక్కరే ప్రచారంచేసినా, లేదా ప్రధాని మోదీతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా అదే తమకు కొండంత బలం అని కమలనాథులు ఆశాభావంతో ఉన్నారు. ఆ మేరకు ప్రయత్నాలూ ఆరంభించినట్లు సమాచారం.
బెంగళూరుతో అనుబంధం
కర్ణాటకలో సైతం సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అభిమానుల బలం మెండుగా ఉంది. రజనీకాంత్ పుట్టింది, చదువుకుంది బెంగళూరులోనే. ఆయన సిటీ బస్ కండక్టర్‌గా పనిచేసింది ఇక్కడి శివాజీనగర బస్టాండ్ నుంచే. పార్టీ ఏర్పాటుపై అభిమానులతో జరిగిన సమావేశాల్లో సైతం కర్ణాటక పై తనకు ఉన్న అభిమానాన్ని రజనీకాంత్ ప్రస్తావించారు. కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ అంటే తనకు ఎంతటి అభిమానం ఉందో, ఎంతటి గౌరవం ఉందో అభిమానులకు తెలియజెప్పారు. దీంతో కర్ణాటకలోనూ రాజకీయంగా ప్రభావం చూపగలనని ఆయన పరోక్షంగా ప్రకటించారు.
మరో స్టార్ క్యాంపెయినర్‌గాయోగి ఆదిత్యనాథ్?
ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మరో స్టార్ క్యాంపెయినర్‌గా కర్ణాటక బీజేపీ తీసుకురానుంది. ఇటీవల ముగిసిన గుజరాత్ ఎన్నికల్లో యోగి చరిష్మా బీజేపీకి బాగా కలిసొచ్చింది. మొత్తం 35 నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించగా అందులో 22 చోట్ల బీజేపీ గెలిచింది. కర్ణాటక రాజకీయాల్లోనూ మఠాలు, స్వామీజీల పాత్ర ప్రబలంగా ఉంది. దీంతో ఆయన రాక వల్ల ఓట్లు లాభిస్తాయని బీజేపీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment