సినిమాలంటే వెర్రెత్తిపోయే తమిళనాడులో కూడా ఎన్నికల సమరంలో రాజకీయ ప్రత్యర్థులను సినిమా సూపర్ స్టార్‌లు ఊడ్చిపారేసే కాలం ముగిసిపోయినట్లేనా? వెండితెర ఇలవేల్పు అయిన ఎన్టీరామారావును సీఎంగా గెలి పించిన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదా? బహుశా రజనీకాంత్ దీన్ని గుర్తించే కాబోలు.. చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావడం నా వల్ల కాదనేశారు. రజనీకాంత్‌ను దాటి ముందుకెళ్లిన మరో సూపర్ స్టార్ కమలహాసన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్–మే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలను ఎక్కువగా గెల్చుకోకపోవచ్చు కానీ అగ్రస్థానంలో నిలబడాలని పోరాడుతున్న రెండు ప్రధాన ద్రావిడ పార్టీలలో ఏదో ఒక పార్టీకి కమల్ సమస్యలు సృష్టించవచ్చు. 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి పాత్రను గుర్తుంచుకోండి చాలు.
తెలుగు మాట్లాడే ప్రాంతంలో రజనీకాంత్ కంటే చిరంజీవి ఎక్కువ క్రేజ్ ఉన్న సూపర్‌స్టార్. 2008లో ప్రజారాజ్యం పేరిట తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించి సీఎం అవ్వాలని తీవ్రంగా కృషి చేశారు. అయితే రియల్ లైఫ్‌కి రీల్ లైఫ్‌కి చాలా తేఢా ఉంటుంది. అందుకే ప్రజారాజ్యం పోటీ చేసిన 296 అసెంబ్లీ స్థానాల్లో 276 స్థానాలను కోల్పోయింది. చివరకు కులపరంగా మెజారిటీ ఉండే తన సొంత ఊరు పాలకొల్లులో ఓడిపోయి పరాభవాన్ని చవి చూశారు. చిరు రాజకీయ జీవితాన్ని చాలా సన్నిహితంగా చూసిన రజనీకాంత్ కీలక సమయంలో చాలా తెలివిగా తనదైన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు చిరంజీవి కూడా కనుమరుగైపోయారు.
ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే, కమల హాసన్ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్ల షేరుకు పరిమితమైపోయారు. అయితే తమిళ రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత కన్నుమూసిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరించే విషయంలో సమీపానికి కూడా కమల్ చేరుకోలేకపోయారు. తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ప్రస్తుత సీఎం ఎడపాడి పళనిస్వామి పూరించేశారని, అన్నాడీఎంకేపై పట్టు సాధించడమే కాకుండా ఒకమేరకు సత్పరిపాలనను అందిస్తున్నారన్న వాస్తవాన్ని గమనించడంలో కమల్ బహుశా విఫలమై ఉండవచ్చు. అదే సమయంలో డీఎంకే పార్టీ శ్రేణులపై ఎంకే స్టాలిన్ తన పట్టును స్థిరపర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ కాంత్ చిట్టచివరలో రాజకీయాల్లోంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయ ప్రాభవాన్ని ఉపయోగించుకుని తమిళనాడులో భారీ స్థాయిలో ప్రవేశించాలనుకున్న బీజేపీ పథకాలకు కూడా రజనీ గండికొట్టారు. మరి కమలహాసన్ కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కానీ రాజకీయంగా బలమైన పాత్ర పోషించగలరా?
తెలుగు ప్రజలు దేవుడిగా భావించే ఎన్టీఆర్ సొంత రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 మాసాల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బలమైన కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నాయకులను నిర్లక్ష్యంగా చూడటంతో జాతీయ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రులను రెచ్చగొట్టిన ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వం లోనూ, ప్రతిపక్షంలోనూ పాతుకుపోయిన రాజకీయ నేతలను పక్కకునెట్టి ఒక సినీ స్టార్ ఆవిర్భవించే పరిస్థితులు లేవనే చెప్పాలి. పెద్ద రాజకీయ పార్టీలు జరిపే రాజకీయ సమరంలో వోట్లను చీల్చివేసే తరహా పాత్ర పోషణకే ప్రస్తుతం చిత్రసీమ ప్రముఖులు పరిమితం కావచ్చు. సినిమాలంటే పిచ్చిప్రేమ చూపించే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కలలు పండించుకోవాలని చూస్తున్న ఏ సినిమా స్టార్‌కైనా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడులో సినీ హీరోలు విజయవంతమైన రాజకీయ నేతలుగా మారే రోజులకు కాలం చెల్లిపోయినట్లే.
లక్ష్మణ వెంకట కూచి
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment