ఉగాది ఎప్పుడూ తీపి గుర్తే
తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం... షడ్రుచుల సమ్మేళనం మనిషి జీవితం. దీనికి ప్రతీక తెలుగు సంవత్సరాది.. ఉగాది. గతేడాది ఉగాదికి నేను హైదరాబాద్‌లో ఉన్నాను. పండక్కి నెల రోజుల ముందే ‘క్షణం’ వంటి సూపర్‌హిట్‌ను తెలుగు ప్రేక్షకులు నాకు బహుమతిగా ఇచ్చారు. నా సంతోషాన్ని ఇక్కడివాళ్లతో కలసి పంచుకున్నా. ఈ నెలలో విడుదలైన హిందీ సినిమా ‘కమాండో–2’ మంచి విజయం సాధించింది. అందులో నేను తెలుగమ్మాయి భావనారెడ్డిగా నటించా.
దాంతో ఈ సంతోషాన్నీ తెలుగు ప్రేక్షకులతో పంచుకోవాలని హైదరాబాద్ వచ్చేశా. కథానాయికగా నా ప్రయాణంలో షడ్రుచులున్నాయి. కానీ, నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది, తీపి గుర్తులు అందించిందీ తెలుగు చిత్ర పరిశ్రమే. అందువల్ల, నేనెప్పుడో తెలుగింటి అమ్మాయిని అయిపోయా. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉగాది అంటే నాకూ ఇష్టమే. ఈ పండక్కి ‘ఐఫా ఉత్సవమ్’లో నేను సంప్రదాయ వస్త్రాధారణలో హాజరవుతున్నా. ఈ వేడుక కోసం మా అమ్మ చీరను కట్టుకుంటున్నా.