ఆ ఘనత తేజూస్‌కే దక్కింది
‘‘తేజూస్ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. వాళ్ల నాన్న నాకు మంచి మిత్రుడు. తేజూస్ ఎనర్జీ చూసి, తప్పకుండా నటుడవుతాడనుకునేవాణ్ణి. కానీ, నా బేనర్ ద్వారానే హీరో అవుతాడని ఊహించలేదు’’ అన్నారు కేయస్ రామారావు. ప్రకాశ్‌రాజ్, స్నేహ ఓ జంటగా, తేజూస్, సంయుక్త మరో జంటగా రూపొందిన చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. తెలుగు వెర్షన్ నిర్మించిన కేయస్ రామారావు మాట్లాడుతూ - ‘‘ప్రకాశ్‌రాజ్‌కి తేజూస్‌ని పరిచయం చేసినప్పుడు తేలికగా తీసుకున్నాడు. ఆ తర్వాత తనలో మంచి హీరో మెటీరియల్ ఉందనే నమ్మకం ఆయనకు కుదిరింది.
నాకు తెలిసి ఏ హీరో ఒకేసారి మూడు భాషల ద్వారా పరిచయం కాలేదు. ఆ ఘనత తేజూస్‌కే దక్కింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలనుకుంటున్నాం. ఇళయరాజాగారు స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. రీ-రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా కుదిరింది. ఈ వేసవికి రాబోతున్న చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’’ అన్నారు.
తేజూస్ మాట్లాడుతూ - ‘‘ఎప్పటికైనా కె.యస్. రామారావుగారి బేనర్లో చేయాలనుకున్నాను కానీ, నా తొలి సినిమాకే అది కుదరడం, ప్రకాశ్‌రాజ్‌గారి కాంబినేషన్‌లో, ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ప్రకాశ్‌రాజ్‌గారు నా మామయ్యగా నటించారు. మొదటి రోజు ఆయన కాంబినేషన్లో సీన్ చేయడానికి కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ, సులువుగానే చేయగలిగాను. అయితే కన్నడ, తమిళ భాషలు తెలియదు కాబట్టి, అక్కడ కష్టమైంది’’ అని చెప్పారు. తేజ దగ్గర ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేశానని, ఓ ఏడెనిమిదేళ్ల తర్వాత డెరైక్షన్ చేస్తానని పేర్కొన్నారు.