'శ్రీమంతుడి కథ నాదే.. కాపీ కొట్టారు'
హైదరాబాద్: తెలుగులో రికార్డులు సృష్టించిన శ్రీమంతుడు చిత్ర యూనిట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా తను రాసిన నవలను కాపీ కొట్టి తీశారని రచయిత శరత్ చంద్ర కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని గురువారం సిటీ సివిల్ కోర్టు అడిషనల్ జడ్జి సింగారెడ్డి కేసు విచారించారు. 2012లో తాను రాసిన నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైందని ఆ నవల కథనే మైత్రీ మూవీ మేకర్స్ 'శ్రీమంతుడు' చిత్రంగా నిర్మాణం చేసిందని పిటిషన్ దారు పేర్కొన్నారు.
ఆయన తరుపున సీనియర్ న్యాయవాదులు వీఆర్ మాచవరం, పవని శివకుమార్ వాదిస్తున్నారు. చిత్ర దర్శకుడు కొరటాల శివతోపాటు ఎర్నినేని నవీన్, హృతిక్ రోషన్లను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీమంతుడు చిత్రాన్ని హిందీ భాషలో తీయాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నారని, విచారణ పూర్తయ్యే వరకు వేరే భాషలోకి వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును శరత్ చంద్ర కోరారు. దీంతో ప్రతివాదులకు అర్జంట్ నోటీసులను జారీ చేసిన కోర్టు.. విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది.