హీరో నాగార్జున పిటిషన్‌పై తదుపరి విచారణ 23కి వాయిదా
సిటీ కోర్టులు: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన మాటలు మాట్లాడారని, ఆమె తమ కుటుంబ పరువు తీసేలా మాట్లాడినందుకు ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే గత విచారణలో ఫిర్యాదుదారు నాగార్జునతో పాటు మరో సాక్షి సుప్రియా వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ జ్యుడీíÙయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టు జడ్జి ఎస్. శ్రీదేవి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఆరోజు కొండా సురేఖ కోర్టుకి హాజరైతే ఆమె వాంగ్మూ లాన్ని కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసు విచారణకు నాగార్జున తరఫున న్యాయ వాది అశోక్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ తిరుపతి వర్మ హాజరయ్యారు.
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు
మంత్రి కొండా సురేఖపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో సెక్షన్ 356 కింద పరువునష్టం కేసు దాఖలు చేశారు. మంత్రి పదవిలో ఉండి.. స్థాయిని మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, తన ప్రతిష్ట దెబ్బతినేలా ఆమె మాట్లాడారని కేటీఆర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనపై అసత్యపు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువునష్టం కేసు దాఖలు చేస్తామని లీగల్ నోటీసు కూడా జారీ చేశామని పేర్కొన్నారు.
అయితే లీగల్ నోటీసు గడువు తీరినా ఆమె క్షమాపణ చెప్పలేదని, అందుకే ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేసు దాఖలు చేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖ గతంలో కూడా అసత్యపు ఆరోపణలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ఎన్నికల సంఘం ఆమెకు చీవాట్లు పెట్టిందని, ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రమే కావని, తన పరువుకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికా బద్ధంగా చేసిన కుట్రగా ఉన్నాయని ఆయన తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ సోమవారం జడ్జి ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment