
షారుక్‌కు అమెరికా క్షమాపణ
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు అమెరికా క్షమాపణ చెప్పింది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఆయనను నిర్బంధించడంతో తీవ్ర ఆవేదనకు గురైన షారుక్.. ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కిన విషయం తెలిసిందే. పదే పదే తనను అమెరికాలో ఇలా అవమానిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. షారుక్‌ను అమెరికా విమానాశ్రయంల ఆపేయడం ఇప్పటికి ఇది మూడోసారి. (చదవండి: అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం)
దాంతో అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు షారుక్ ఖాన్‌కు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. 'విమానాశ్రయంలో కలిగిన అసౌకర్యానికి సారీ షారుక్ ఖాన్.. కానీ అమెరికన్ దౌత్యవేత్తలను కూడా అదనపు తనిఖీల కోసం ఆపుతాం' అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఎలాంటి కారణం లేకుండా షారుక్‌ను మళ్లీ మళ్లీ ఆపడంపై భారత ప్రభుత్వ వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తి తెలిపాయి. ఇక షారుక్ ఎలా బయటకు వచ్చారన్న విషయం కూడా స్పష్టంగా తెలియరాలేదు. ఆయన తనంతట తానే వచ్చారా.. లేదా భారత అధికారులు కల్పించుకున్న తర్వాత అమెరికా ప్రభుత్వం స్పందించిందా అన్న విషయం తెలియలేదు.