సినిమాలకు ప్రేమను మించిన గొప్ప సాఫ్ట్‌వేర్ లేదు. తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచీ చూస్తే... ఈ 82 ఏళ్లల్లో వేల చిత్రాలు చ్చాయి.
వాటిల్లో అధికశాతం చిత్రాలకు ముడిసరుకు ప్రేమ అంటే అతిశయోక్తి కానే కాదు. సినిమా మేకింగ్ పరంగా రకరకాల మార్పులు వచ్చినట్టుగానే, ఎన్నెన్నో ట్రెండ్‌లు వచ్చినట్టుగానే ప్రేమ కథల్లో కూడా రకరకాల పరిణామాలు టుచేసుకున్నాయి. మొదట్లో చాలా సున్నితంగా ఉండే ప్రేమకథలు రాన్రానూ పక్కా కమర్షియల్ అయిపోయాయి. అసలు ప్రస్తుతం ప్రేమకథల పరిస్థితి ఏంటి?
‘ప్రేమికుల రోజు’ సందర్భంగా ఇప్పటి లవ్ సినిమాల ట్రెండ్ గురించి...
‘‘పన్నెండేళ్ల నుంచి ప్రేమిస్తున్నా తనని. ఇదిగో తను చిన్నప్పుడు వాడిన పట్టీలు, ఇదిగో తను మొట్టమొదట జడవేసుకున్నప్పుడు పెట్టుకున్న తలపిన్ను...’’ అంటూ ఓ కుర్రాడు జాబితా చెబుతుంటాడు. అప్పుడు ఆ కుర్రాడు ప్రేమించిన అదే అమ్మాయిని తను ఎన్నాళ్లు ప్రేమిస్తాడో తనకే తెలీదనే మరోయువకుడు, అతని స్నేహితుడు కలిసి ‘‘వీడో కలెక్షన్ కింగ్‌రా’’ అంటూ ఆటపట్టిస్తారు. ‘ఆరెంజ్’ సినిమాలోని ఈ సన్నివేశంలో... ఒకప్పుడు ఆర్ద్రత పొంగిపొర్లే సిసలైన ప్రేమికుడికి చిహ్నమైన కుర్రాడు కాస్తా కమెడియన్ అయిపోయాడు.
భావం పోయి... వేగం మిగిలి...
సినిమా ప్రేమలు అంతకంతకూ కరకు దేలుతున్న వైనానికి ఇలాంటి సన్నివేశాలెన్నో అద్దం పడతాయి. ఓ అందమైన, అపురూపమైన భావోద్వేగంగా గొప్పగొప్పవాళ్లు పేర్కొన్న ఆ అనుభూతిలో వేగాన్ని మాత్రమే మిగిల్చి భావాన్ని మాయం చేసిన ఆనవాళ్లెన్నో కళ్లకు కడతాయి. కొంత కాలం క్రితం వచ్చిన ఇడియట్ సినిమాలో హీరో రోడ్డు మీద వెళుతున్న అమ్మాయి నచ్చగానే ఐలవ్‌యూ చెబుతాడు. తాజాగా అదే పూరి జగన్నాథ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో హీరో రోడ్డు మీద కనపడిన అమ్మాయిని ‘‘ప్రేమించనుగానీ ఓ ముద్దివ్వు’’ అనడుగుతాడు. ఆ అమ్మాయి ముద్దు పెట్టి వెళ్లిపోయిన కొన్నిరోజులకి తను ఆమెని ప్రేమించిన విషయం హీరోగారికి జ్ఞానోదయం అవడం ఫైనల్ టచ్. సినిమా ప్రేమల్లో శరవేగంగా వస్తున్న మార్పులకు ఇదో ఉదాహరణ.
సారీ ఫర్ శాక్రిఫైస్...
ప్రేమంటే ఎదుటివారి సుఖం కోరుకోవడం లేదా ప్రేమించిన మనిషి కోసం త్యాగాలకు సిద్ధపడడం. ఈ మాట ఇప్పటి సినీప్రేమలకు ఏ మాత్రం నప్పని విషయం. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో హీరో ఓ అమ్మాయిని చూసి ఫ్లాటైపోతాడు. ఆ అమ్మాయనుకుని ఇంకో అమ్మాయికి ఫోన్లు చేస్తాడు. తర్వాత మొదటి అమ్మాయి తన ఫ్రెండ్‌నే ప్రేమిస్తోందని తెలుసుకుని ఫ్రెండ్ నుంచి ఆమెని దూరం చేయడానికి నానా తంటాలూ పడతాడు. దానికోసం అన్ని హద్దులూ దాటేసి చీప్‌గా ప్రవర్తిస్తాడు. మరోవైపు ఎవరో అమ్మాయనుకుని అనవసరంగా తనను డిస్ట్రబ్ చేశాడని తెలిసిన హీరోయిన్ అప్పటిదాకా ఫీలైన ప్రేమంతా తూచ్ అని తుడిచేసుకుని హీరో మీద పగతీర్చుకోవడానికి అతనికి బాస్‌గా మారుతుంది. ప్రేమ కోసం చంపు లేదా చావు అనేంతటి మూర్ఖత్వం ఆ అందమైన భావనలోని సున్నితత్వానికి సమాధి కడుతోంది. ‘ఆర్య-2’ సినిమాలో తన ఫ్రెండ్‌ని ప్రేమిస్తున్న అమ్మాయిని తనకి దగ్గర చేసుకోవడానికి హీరో అన్ని రకాలుగా తెగిస్తాడు. ఓ రకంగా చెప్పాలంటే తన ఫ్రెండ్ విషయంలో హీరోయిన్ మనసులో విషబీజాలు నాటి మరీ తనవైపు తిప్పుకుంటాడు.
ముందైనా...పసందే...
ప్రేమించుకున్నవారు పరిధుల్లో ఉండాల్సిన అవసరం ఏ మాత్రం లేదని నేటి సినిమాలు తేల్చిచెబుతున్నాయి. ్ర‘పేమకథా చిత్రమ్’ సినిమాలో చచ్చిపోదామనుకున్న హీరో మనసును మార్చడానికి హీరోయిన్ శారీరక సంబంధానికి సైతం ఓకే అనేస్తుంది. ఇక ఆ మధ్య వచ్చిన ‘తీన్‌మార్’ సినిమాలో హీరో, హీరోయిన్లు ‘అంతా అయిపోయే’ వరకూ ఒకరి పేర్లు ఒకరు తెలుసుకోకపోవడం ఈ ధోరణికి పరాకాష్ఠ. చిత్రాల్లో విచిత్రంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎన్నో సినిమాల్లో తమ మధ్య ఉన్నది ప్రేమా, స్నేహమా అనేది తెలియకపోవడం... ప్రస్తుత ప్రేమల్లోని అయోమయానికి నిదర్శనంగా నిలుస్తుంది.
పరిణితి తక్కువ...ప్రణయం ఎక్కువ...
ఆధునిక ప్రేమల్లో పబ్లిగ్గా ఒకరి మీద ఒకరు వాలిపోయేంత వ్యామోహం ఎంత ఎక్కువ కనపడుతుందో, ఒకరి కష్టాన్ని ఒకరు మోసే ఓర్పు అంత తక్కువ కనపడుతుంది. ఈ వాస్తవానికి అద్దం పడుతున్న రీల్ లవ్‌లూ లేకపోలేదు. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాలో హీరో హీరోయిన్లు తమ ప్రేమ మీద తమకే నమ్మకం కలగక ‘కాపురం పరీక్ష’కు సిద్ధమవుతారు. అనుబంధం కోసం అణువంత సమస్యను కూడా భరించలేక... పెళ్లి కాని తమ కాపురం విఛ్చిన్నం చేసుకునేదాకా వెళతారు.నేటి లివిన్ (సహజీవనం) జంటల మనస్తత్వాలకు ఇది దగ్గరగా ఉంటుందీ చిత్రం. ఇక ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వారిని కలపాలనుకున్న కొందరు స్నేహితుల జీవితాలను ఆ ఒక్క ఆలోచన ఎంతలా తలకిందులు చేస్తుందో, ఇంతా చేస్తే ఆ ఇద్దరూ ఎంత తేలిగ్గా తమ ప్రేమను చంపేసుకుంటారో ‘శంభో శివ శంభో’ సినిమా చూపుతుంది. సినిమా సమాజాన్ని నడుపుతుందా, సమాజపోకడలపై ఆధారపడి సినిమా నడుస్తుందా అనే వాదోపవాదాలు అలా ఉంచితే... బయట అసాధారణంగా జరిగే ఒకటీ అరా సంఘటనల ఆధారంగానే సినిమాలు రూపుదిద్దుకుంటాయని, అవి అత్యంత సాధారణంగా జరిగేవిగా చూపిస్తాయనేది నిజం. ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే జీవితం... అందు లోని అత్యంత అపురూప అనుభవం అయిన ప్రేమ అబద్ధం కాకుండా ఉంటాయనేది కూడా నిజం.
- ఎస్.సత్యబాబు