నాతోటి పందాలు వేస్తే సస్తరు | Valmiki Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

నాతోటి పందాలు వేస్తే సస్తరు

Sep 10 2019 6:01 AM | Updated on Sep 10 2019 6:01 AM

Valmiki Movie Trailer Launch - Sakshi

రామ్‌ ఆచంట, హరీష్‌ శంకర్, వరుణ్‌ తేజ్, మిక్కీ జె. మేయర్, గోపీ ఆచంట

‘నాపైన పందాలు ఏస్తే గెలుస్తరు.. నాతోటి పందాలు వేస్తే సస్తరు, మనం బతుకుతున్నామని పదిమందికి తెల్వకపోతే ఇక బతుకుడెందుకురా, గవాస్కర్‌ సిక్సు కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడు.. నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేం టు సేం, గద్దలకొండ గణేశ్‌ అంటే గజ గజ వణకాలి’ అంటూ ‘వాల్మీకి’ ట్రైలర్‌లో వరుణ్‌ తేజ్‌ చెప్పిన డైలాగ్‌లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కి ఇది తెలుగు రీమేక్‌. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘వాల్మీకి’ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు.

హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’ సినిమాని నేను ఏ దృష్టితో చూశానో వరుణ్‌ కూడా అదే కోణంలో చూసి నటించేందుకు ఒప్పుకున్నాడు. ‘ఫిదా, తొలిప్రేమ’ వంటి సాఫ్ట్‌ పాత్రలు చేసిన వరుణ్‌ ‘వాల్మీకి’ లో పక్కా మాస్‌ పాత్ర చేశారు. ఇలాంటి పాత్ర చేయాలంటే ధైర్యం ఉండాలి. హిందీ ‘దబాంగ్‌’ సినిమాని ‘గబ్బర్‌సింగ్‌’గా రీమేక్‌ చేసినప్పుడు చాలా మార్పులు చేశాను.. ‘వాల్మీకి’లో మాత్రం మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మాత్రమే మార్పులు చేశాం. మిక్కీ జె. మేయర్‌ మంచి సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. ‘వాల్మీకి’ టైటిల్‌పై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చూసి బోయ సంఘంవారు, వాల్మీకి అభిమానులు గర్వపడతారు’’ అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ  సినిమాలో గద్దలకొండ గణేశ్‌ పాత్ర చేశా. ఇందులో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయి. ఈ టైమ్‌లో ఇలాంటి పాత్ర అవసరమా? అని చాలామంది అన్నారు. కానీ హరీష్‌గారు నాకు నమ్మకం ఇచ్చారు. కొన్ని సినిమాలు రీమేక్‌ చేయాలనే స్ఫూర్తినిస్తాయి.. ‘జిగర్తాండ’ అలాంటి చిత్రమే. చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్‌... వంటి వారు గతంలో చేసిన సినిమాలు చూస్తే రాముడు మంచి బాలుడు అనేలా హీరోలా పాత్రలు ఉండేవి. ఈ మధ్య హీరోలు నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. నేను కూడా హీరోలాంటి పాత్రలు చేశా. కానీ, వైవిధ్యంగా ఉండేలా ప్రయోగాత్మకంగా ఏదైనా ఓ పాత్ర చేయాలనుకున్నా. అలాంటి పాత్రే ఇది. ఈ పాత్ర నాకే కొత్తగా అనిపించింది. సినిమాలో మంచోడి కంటే చెడ్డోడి పాత్ర బాగుంటుంది (నవ్వుతూ)’’ అన్నారు.

‘‘టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన హరీష్‌ శంకర్, రామ్‌ ఆచంట, గోపి ఆచంటగార్లకు థ్యాంక్స్‌. ఈ సినిమాలో ‘జర జర...’ పాటకి చాలా మంచి స్పందన వస్తోంది’’ అని సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌ అన్నారు. నిర్మాత రామ్‌ ఆచంట పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement