‘వంగవీటి’ తర్వాత తెలుగు సినిమా చేయను!
రామ్ గోపాల్ వర్మ
కొన్నేళ్ళ క్రితం పరిటాల రవి కథతో ‘రక్త చరిత్ర’. నిన్న... గంధపు చెక్కల స్మగ్లర్ వీర ప్పన్‌పై ‘కిల్లింగ్ వీరప్పన్’... మరి ఇప్పుడు? విజయవాడకు చెందిన రాధా, రంగాల జీవి తంపై తీస్తున్న ‘వంగవీటి’! దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు! ‘‘ ‘వంగవీటి’ చిత్రం తర్వాత నేను తెలుగులో సినిమాలు తీయను’’ అని ఆయన తాజాగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. విజయవాడ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘వంగవీటి’ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ- ‘‘నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా నిజంగా పుట్టింది, పెరిగింది విజయవాడలోనే. నాకు బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు, చంపుకోవడాల గురించి తెలిసింది విజయవాడలోనే. అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ‘రక్తచరిత్ర’కి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్‌లో తీయబోతున్న ‘వంగవీటి’కి ఉన్న తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడానే.
30 ఏళ్ల క్రితం విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు రౌడీయిజం రూపాన్ని, ఆంతర్యాన్ని చూశాను. అక్కడి రౌడీయిజం గురించి నా కంటే ఎక్కువ తెలిసినవారు విజయవాడలో కూడా లేరు. చలసాని వెంకటరత్నాన్ని రాధా చంపడంతో ప్రారంభమైన విజయవాడ రౌడీయిజం రంగాను చంపడంతో ఎలా అంతమైందో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘శివ’తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం ‘వంగవీటి’తో ముగించాలనుకోవడానికి కారణం ఉంది. ‘వంగవీటి’ కంటే నిజమైన గొప్ప కథ మళ్లీ నాకు జీవితంలో దొరకదని కచ్చితంగా తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని తెలిపారు.