
తమిళసినిమా: నటి వరలక్ష్మి బీజేపీలో చేరారా? తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం ఇదే. కథానాయకి, ప్రతి కథానాయకి అంటే తారతమ్యాలు చూపకుండా చేతి నిండా చిత్రాలతో యమ బీజీగా ఉన్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. అంతే కాకుండా మహిళా రక్షణ కోసం సేవ్‌శక్తి అనే సేవాసంస్థను నెలకొల్పి మహిళల కోసం గళం విప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను బుధవారం బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరన్ ఆమె ఇంట్లో కలిశారు. అంతే మీడియా వరలక్ష్మీ శరత్‌కుమార్ చుట్టూ రాజకీయాన్ని అల్లేస్తోంది. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
ఈ వ్యవహారంపై స్పందించిన వరలక్ష్మీశరత్‌కుమార్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ మహిళా రక్షణ తదితర విషయాల గురించి తాను మురళీధరన్‌తో భేటీ అయిన సందర్భంగా చర్చించిన మాట వాస్తవమేనని, ఇది మంచి భేటీగా అమరిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ తమ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకోవడం మంచి పరిణామం అని అన్నారు. అయితే మురళీధరన్‌తో తన భేటీని మీడియా నిరాధార వార్తలను ప్రచారం చేస్తోందని అన్నారు. అలాంటి వారికి తాను చెప్పేదొక్కటేనన్నారు. తానూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న సామెతను గుర్తు చేసుకోవలసిన పరిస్థితిది. పైగా సినీ తారలు రాజకీయాలపై మోజు పడుతున్న తరుణం ఇది. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో! నటి వరలక్ష్మిది రాజకీయ నేపథ్యమే కదా! ఆమె తండ్రి శరత్‌కుమార్ ఒక పార్టీని నడుపుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment