
అన్షులా కపూర్, వరుణ్ ధవన్
తమ అభిమాన స్టార్స్‌ని కలవాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలా స్టార్స్‌ను ఫ్యాన్స్‌ను కలిపేలా ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి దాన్ని చారిటీకి ఉపయోగించాలనుకుంటున్నారు అన్షులా కపూర్. ఇంతకీ అన్షులా కపూర్ ఎవరంటే.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య కుమార్తె. నటుడు అర్జున్ కపూర్ చెల్లెలు. నాన్న, అన్నలా సినిమాల్లోకి రాలేదు అన్షులా. అయితే సేవా కార్యక్రమాలు చేయడం తనకి చాలా ఇష్టం. ఇందులో భాగంగానే ‘ఫ్యాన్ కైండ్’ అనే ఆన్‌లైన్ ఫండ్ రైజింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారామె. మన అభిమాన స్టార్స్‌తో క్రికెట్, బేకింగ్, పింట్ బాల్.. ఇలా సరదాగా గేమ్స్ ఆడుకోవచ్చు.
ఇందుకోసం 300 పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్స్‌తో వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తం విరాళాలకు ఉపయోగిస్తారట. బాలీవుడ్ యాక్టర్స్ వరుణ్ ధవన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హాలు ఈ ఫ్యాన్‌కైండ్ సంస్థతో అనుబంధమయ్యారు. ‘‘నీటి కొరత వల్ల ఈ ఏడాది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఈవెంట్‌తో వచ్చిన డబ్బుని వాళ్లకు ఉపయోగపడేలా చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు వరుణ్. ‘‘అభిమానులకు వాళ్ల ఆనంద క్షణాలు ఇస్తూనే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు అన్షులా కపూర్.
Comments
Please login to add a commentAdd a comment