అట్టహాసపు పెళ్లిలో చెలిగింతలు | Veere Di Wedding Movie Review | Sakshi
Sakshi News home page

వీరే ది వెడ్డింగ్‌

Published Sat, Jun 2 2018 12:38 AM | Last Updated on Sat, Jun 2 2018 12:38 AM

Veere Di Wedding Movie Review - Sakshi

జీవితంలో ఎన్నో కష్టాలుండొచ్చు. బంధుత్వాల భారాలు మోయలేనంతవిగా ఉండొచ్చు. ఎడబాట్లు బాకుల్లా గుచ్చుకోవచ్చు. సంప్రదాయాలు కొరికినట్లు అనిపించొచ్చు. ఒక్కరిగా అనుభవించాలి అంటే నరకమే అనిపించొచ్చు. కానీ ముగ్గురు చెలియలు కష్టాల్ని మరపించే చక్కలిగింతలు పెడుతుంటే ప్రపంచం మళ్లీ అందంగా అనిపిస్తుంది. బంధాలు మరోసారి తియ్యగా అనిపిస్తాయి. ‘వీరె ది వెడ్డింగ్‌’ అలాంటి అనుభూతుల ‘చెలిగింతలు’... ఇవాళ రేపు రక్త సంబంధాలు నిర్వచించడానికి కష్టంగా ఉంటున్నాయి. దగ్గరి సంబంధాలు అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నాయి. ఆధునిక జీవితంలో మనిషి ఒంటరి అవుతున్నాడు.

అతణ్ణి అంతో ఇంతో కాపాడుతున్నది స్నేహ సంబంధాలే. నలుగురు స్నేహితురాళ్లు ఒకరికొకరు నిలబడి ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నించిన కథే ‘వీరే ది వెడ్డింగ్‌’. హిందీ సినిమాలలో కొత్త ధోరణిలో కథలు చెప్పడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక కొనసాగింపు. ‘లైంగిక నిస్పృహ’, ‘ఫ్రీ సెక్సువల్‌ ఎక్స్‌ప్రెషన్‌’ సినిమాల్లో చూపించడానికి బాలీవుడ్‌ ప్రయత్నిస్తోందనడానికి కూడా ఈ సినిమా ఒక ఉదాహరణ. కరీనా కపూర్, సోనమ్‌ కపూర్, స్వర భాస్కర్‌ వంటి మంచి ఆర్టిస్టులు ఉండటం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో సఫలమైందనే చెప్పాలి.  శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. దర్శకుడు ‘శశాంక్‌ ఘోష్‌’.

కథ..
కాళింది పూరి (కరీనా కపూర్‌), అవ్ని మల్హోత్రా (సోనమ్‌ కపూర్‌), సాక్షి సోనీ (స్వర భాస్కర్‌) , మీరా (శిఖా తల్సానియా) ఈ నలుగురు చిన్నప్పటి నుంచి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. అందరూ ఎవరికి వారు ఇండిపెండెంట్‌గా ఉండాలనుకొనే మనస్తత్వం ఉన్నవారు. నలుగురిలో ఒకరైన కాళింది  చిన్న వయస్సులోనే తల్లిని పోగొట్టుకుంటుంది. మరో పెళ్లి చేసుకున్న తన తండ్రితో అంతంత మాత్రమే సంబంధ భాందవ్యాలుంటాయామెకు. తండ్రికి, బాబాయ్‌కు ఆస్తి గొడవలు జరిగి తను పెరిగిన ఇల్లు శాంతి నివాసానికి కోర్టు తాళం వేస్తుంది. ఢిల్లీ నుండి వెళ్లిపోయి ఆస్ట్రేలియాలో ఉంటుంది కాళింది. అక్కడ ఓ రోజు ఆమె బోయ్‌ ఫ్రెండ్‌ రిషబ్‌ మల్హోత్రా (సుమిత్‌ వ్యాస్‌)  మ్యారేజ్‌ ప్రపోజల్‌ పెడతాడు (అప్పటికే వారిద్దరూ రిలేషన్‌ షిప్‌లో ఉంటారు).  ప్రపోజల్‌కి కారణం ఇంట్లో పెద్ద వాళ్లు ఒత్తిడి చేస్తుంటారు.

‘ఇప్పుడు ఇలా బాగానే ఉంది కదా పెళ్లెందుకు. పెళ్లి చేసుకుంటే లేనిపోని చిక్కుల్లో పడతాం’ అంటుంది కాళింది. కానీ తన ఇంట్లో వాళ్లకోసం సంప్రదాయం పేరు చెప్పి ఆమెతో సరే అనిపిస్తాడు రిషబ్‌. ఆ విషయాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి అందర్నీ తన వివాహానికి ఆహ్వానిస్తుంది. అక్కడ నుండి కథ ఇండియాకు (ఢిల్లీ) వస్తుంది. అప్పటికే మిగతా ముగ్గురు ఫ్రెండ్స్‌లో ఒకరైన మీరాకి ఒక ఆంగ్లో ఇండియన్‌తో పెళ్లయి ఒక బాబు ఉంటాడు. మరో స్నేహితురాలు సాక్షికి లండన్‌లో ఉన్న బిజినెస్‌ మేన్‌తో పెళ్లయి వాళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుందామె. ఆ బాధలో ఆమె ఎప్పుడూ తాగుతూ పర్వర్టెడ్‌లా మారిపోతుంది. ఇక మిగిలిన స్నేహితురాలు అవ్ని ఢిల్లీ కోర్టులో లాయర్‌గా (విడాకులు ఇప్పించే లాయర్‌)  పని చేస్తుంటుంది. ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ స్కైప్‌లో మాట్లాడుకోవలసిందే ఆ మిత్రబృందం.

పెళ్లి హడావిడి....
మామూలుగా ‘పెళ్లి’ అంటే సింపుల్‌గా గుళ్లో అయినా చేసుకోవచ్చు. కానీ దాన్ని అట్టహాసంగా చేస్తే అదో పెద్ద తంతు. ఇక్కడే మన హీరోయిన్‌ కాళిందికి కాలింది. ప్రతి చిన్న విషయాన్ని ధూమ్‌  ధామ్‌ చేద్దాం అనుకునే వరుడి తరఫున తల్లిదండ్రులు, చుట్టాలు హడావిడి. ఉదాహరణకు కాళింది, రిషబ్‌ ఆస్ట్రేలియా నుండి ఇండియా చేరుకోగానే ఎయిర్‌పోర్ట్‌లోనే కార్యక్రమాల హడావిడి షురూ అవుతుంది. తన కాబోయే కోడలికి పూజారితో తిలకం దిద్దించడం నుంచి నగలు పెట్టడం దాకా  అన్ని కార్యక్రమాలతోటి చాలా హడావిడి చేస్తుంటుంది రిషబ్‌ తల్లి. ఇదంతా తనకు చాలా ఇబ్బందిగా ఉందని, తనవల్ల కాదని రిషబ్‌కు చెప్తుంది కాళింది.  ఓ నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే అన్ని కార్యక్రమాలు శుభ్రంగా ముగిసిపోతాయి... మన దారిన మనం హ్యాపీగా ఆస్ట్రేలియా వెళ్లిపోవచ్చు... సర్దుకుపోవాలని చెప్తాడతను.

రిషబ్‌ తన మీద చూపించే ప్రేమ కోసం అన్నిటికీ సరేనంటు ఒప్పుకొంటుంది కాళింది. సంగీత్‌ కార్యక్రమాన్ని రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తారు పెళ్లికొడుకు తరఫువారు. ఆ సందర్భంగా అందరూ పార్టీలో ఉంటే రిషబ్, కాళింది మాత్రం స్టేజీ మీద నుండే గొడవ పడుతుంటారు.  ఆమె తొడుక్కునే రింగ్‌ విషయంలోనే వారిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ కార్యక్రమమంతా రభసగా మారుతుంది. అక్కడి నుండి ఒక్కొక్కరు ఓ రకంగా బయటì కెళతారు.  ఈ గొడవలు, గందరగోళం అంతా పెళ్లి వల్లే అందుకే ఇవేవీ వద్దు నా దారిన నేను ఆస్ట్రేలియా వెళతాను అనుకుని తన స్నేహితులకు చెప్పి బయలుదేరుతుంది కాళింది. ఆమె పెళ్లి చేసుకోకుండానే ఆస్ట్రేలియా వెళ్లిపోయిందా? తన తండ్రితో తన రిలేషన్‌ ఎలా ఉంది? చివరకు తను పుట్టి పెరిగిన ఇల్లు తన చేతికి వస్తుందా? స్నేహితురాళ్లంతా ఆమె కోసం ఏం చేశారు? అనేది మనం సినిమా థియేటర్లోనే చూడాలి.  

సినిమా ప్లస్‌ పాయింట్స్‌... ∙యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే మ్యారేజ్‌ కాన్సెప్ట్‌ ∙బోల్డ్‌ డైలాగ్స్‌ ∙కెమెరా వర్క్‌ ∙కలర్‌ఫుల్‌ కాస్టూమ్స్‌
మైనస్‌ పాయింట్స్‌... స్లో న్యారేషన్‌.
తారాగణం : కరీనా కపూర్, సోనమ్‌ కపూర్, స్వరా భాస్కర్, శికా తల్సానియా
దర్శకుడు : శశాంక్‌ ఘోష్‌
నిర్మాణం :  బాలాజీ మోషన్‌ పిక్చర్, అనిల్‌కపూర్‌ ఫిల్మ్స్‌
కెమెరా : సుధాకర్‌ రెడ్డి యాకంటి

– శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement