
వెనిస్ చిత్రోత్సవాల్లో రజనీ డాక్యుమెంటరీ
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రాచుర్యం మనదేశంలోనే కాదు పొరుగు దేశాలకు ఎప్పుడో పాకింది. జపాన్, కెనడా, మలేషియా దేశాల్లో రజనీకాంత్ అభిమాన దళం ఉంది. ఆయన చిత్రాలకు అక్కడ విశేష ఆదరణ ఉంటుంది. ఇక తమిళనాడులో అయితే రజనీకాంత్ చిత్రాలు విడుదల సమయాల్లో ఆయన పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ పుట్టినరోజు కంటే రజనీకాంత్ పుట్టినరోజే వారికి పండుగ రోజు అంటే అతిశయోక్తి కాదు.
ఇకపోతే మన సూపర్‌స్టార్ ఖ్యాతిని, ఆయన అభిమానగణం హంగామా, ఆర్భాటాల దృశ్యాలను ఒక డాక్యుమెంటరీగా రూపొందించి వెనిస్‌లో జరుగుతున్న 72వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. విదేశానికి చెందిన రింకు గాల్సి ఆయన మిత్రుడు జోయోజిత్‌పాల్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. వారు ఒక టెలివిజన్ చానల్‌లో చేస్తున్న పనికి రాజీనామా చేసి నాలుగేళ్లుగా ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించడం విశేషం.