ఈ మామకు ఇంకేం కావాలి : వెంకటేష్‌ | Venkatesh And Naga Chaitanya New Movie With Director Bobby | Sakshi
Sakshi News home page

ఈ మామకు ఇంకేం కావాలి : వెంకటేష్‌

Published Mon, Dec 9 2019 12:49 AM | Last Updated on Mon, Dec 9 2019 2:49 AM

Venkatesh And Naga Chaitanya New Movie With Director Bobby - Sakshi

సురేష్‌బాబు, రాశీఖన్నా, నాగచైతన్య, వెంకటేష్, పాయల్‌ రాజ్‌పుత్, బాబీ

‘‘వెంకీ మామ’ సినిమాలోని ‘అమ్మయినా నాన్నయినా నువ్వేలే వెంకీ మామ...’ పాటలా నాకంతా నా అభిమానులే. నా 30 ఏళ్ల కెరీర్‌లో మీరే నా బలం. ఈ నెల 13న కలుద్దాం’’ అని వెంకటేష్‌ అన్నారు. కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఖమ్మంలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతూకు మాత్రమే మామ.. కానీ, సినిమా విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే.

ఎక్కడికి వెళ్లినా వెంకీ మామ అంటున్నారు. ఈ సినిమాలో చైతూ చించేశాడు.. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. మామ– అల్లుడు సెంటిమెంట్‌ని బాబీ చాలా బాగా తీశాడు. తమన్‌ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు.  నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘నా లైఫ్‌లో రెండే రెండు సినిమాలు.. ఒకటి ‘మనం’.. రెండోది ‘వెంకీ మామ’. కెమెరా వెనుక ఓ మామ(సురేష్‌బాబు).. ముందు మరో మామ(వెంకటేష్‌).. నన్ను చాలా బాగా చూసుకున్నారు. బాబీ కూల్‌ డైరెక్టర్‌. ఈ మూవీలో మామా అల్లుళ్ల అల్లరి మామూలుగా ఉండదు’’ అన్నారు.  బాబీ మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన వెంకటేష్, నాగచైతన్య, మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులందరికీ నమస్కారం. ఏ హీరో అభిమానులు కూడా నెగిటివ్‌ మాట్లాడని హీరో వెంకటేష్‌గారు. చిన్నప్పుడు వీసీఆర్‌ కోసం వెళ్తే వెంకీగారి సీడీలు దొరికేవి కావు.. మహిళలు తీసుకుని వెళ్లేవాళ్లు. బ్లాక్‌లో తీసుకుని రావాల్సి వచ్చేది.

‘ఎఫ్‌ 2’లో వెంకటేష్‌గారి ఫన్‌ చూశారు.. ‘వెంకీ మామ’ లో ఆయన మాస్‌ యాంగిల్‌ చూపించాను. ఎంతో కుటుంబ నేపథ్యం ఉన్నా చైతూ కొత్త హీరోగానే ఆలోచిస్తాడు. సురేష్‌ బాబుగారు పెద్ద పుస్తకం’’ అని తెలిపారు. ‘‘వెంకీ మామ’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రాశీఖన్నా. ‘‘వెంకటేష్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఇంత త్వరగా పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ‘‘అన్ని రకాల భావోద్వేగాలున్న మంచి సినిమా ‘వెంకీ మామ’’ అన్నారు సురేష్‌ బాబు. ‘‘వెంకటేష్, నాగ చైతన్యలతో గ్రేట్‌ మల్టీస్టారర్‌ నిర్మించడం ఆనందంగా ఉంది’’ అన్నారు విశ్వప్రసాద్‌.  ‘‘వెంకీ, చైతూల నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వివేక్‌ కూచిభొట్ల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement