
వైవిధ్యమే విక్టరీ
హీరో అంటే నేల విడిచి సాము చేయాలనే బాక్సాఫీస్ సూత్రాలకు చాలా దూరంగా ఉంటారు వెంకటేశ్. సహజత్వానికే అధిక ప్రాధాన్యమిస్తారాయన. సాధ్యమైనంతవరకూ సమాజంలో ఒకడిగా కనిపించడానికే మొగ్గు చూపుతారు. నాటి ‘శ్రీనివాస కల్యాణం’ నుంచి సంక్రాంతికి రాబోతున్న ‘గోపాల గోపాల’ వరకూ ఆయన చేసింది అదే. అందుకే... వెంకటేశ్‌కు ప్రత్యేక అభిమానగణం ఉన్నారు. పాత్రల పరంగా ఈ పాతికేళ్లలో ఎన్నో ప్రయోగాలు చేశారాయన. ఏడు నంది అవార్డులు, ఏడు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు పలు ప్రైవేటు పురస్కారాలు వెంకీని వరించాయంటే కారణం అదే.
నేటికీ ప్రయోగాలకు వెనుకాడరు వెంకటేశ్. స్టార్‌గా కంటే నటునిగా గుర్తుండటానికే ఇష్టపడతారాయన. మల్టీస్టారర్స్‌కి మళ్లీ జీవం పోసి, తెలుగు తెరపై ఓ ఆరోగ్యకరమైన వాతావరణానికి తెర లేపిన ఘనత కూడా వెంకటేశ్‌దే. మహేశ్, రామ్‌లతో కలిసి ఇప్పటికే నటించిన వెంకీ... సంక్రాంతికి ‘గోపాల గోపాల’తో పవన్‌కల్యాణ్‌తో తెరను పంచుకోనున్నారు. నేడు వెంకటేశ్ 54వ పుట్టిన రోజు. ఈ వయసులో కూడా ధాటిగా సినిమాలు చేస్తూ, తన తర్వాతి తరం వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకటేశ్..