టీజీ విశ్వప్రసాద్, సురేశ్‌బాబు
‘‘37 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్నాను. మన పాత హిట్ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు సంతృప్తిగా అనిపించవు. హిట్ అవుతాయి. కానీ ఏదో వెలితిగా ఉంటుంది. సొంత యాక్టర్స్‌ని పెట్టి సరైన సినిమాలు తీయకపోతే ప్రేక్షకులు నవ్వుతారనే భయం ఉంటుంది. అందుకే కథలను సులువుగా అంగీకరించలేను’’ అన్నారు సురేశ్‌బాబు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘వెంకీ మామ’. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ శుక్రవారం చిత్రం రిలీజ్ సందర్భంగా సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు.
సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘వెంకీ మామ’ కథను జనార్థన మహర్షి రాశారు. ఐడియా బావుంది. కానీ ట్రీట్‌మెంట్‌లో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ఈ ఐడియాను కోన వెంకట్‌కు చెప్పాను. వర్క్ చేయొచ్చు అన్నారు. బాబీ పేరుని కోన వెంకట్ సూచించారు. బాబీ తన టీమ్‌తో తన స్టయిల్లో వర్క్ చేసి నాకు చెప్పాడు. మామాఅల్లుడి బంధాన్ని చూపించే ఓ సన్నివేశాన్ని నాకు వివరించగానే నా కళ్లలో నీళ్లు ఆగకుండా వచ్చాయి. ఈ సినిమా చేస్తున్నాం అన్నాను.
‘వెంకీ మామ’ సినిమా సూపర్, బంపర్ అలాంటివి చెప్పలేను. పూర్తి స్థాయి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వెంకటేశ్, నాగచైతన్య కెమిస్ట్రీ హైలైట్‌గా ఉంటుంది. వెంకీ, చైతన్య ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. ఇంతకుముందు కథ విన్న తర్వాత ‘కానీ... ఏదో మిస్ అయింది’ అనేవాణ్ణి. ఇప్పుడు ఏం మిస్ అయిందో చెప్పగలుగుతున్నాను. సినిమా గురించి ఎక్కువ తెలుసుకుంటున్న కొద్దీ అందులో తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కథ చెప్పే దశలోనే ఉన్న సందేహాలు ఎక్కువగా అడిగేస్తుంటాను. కథలు అంత సులువుగా ఓకే చేయనని కూడా అనుకోవచ్చు(నవ్వుతూ). ఇంతకుముందు షూటింగ్‌కి వెళ్లాక కూడా డౌట్స్ అడిగేవాణ్ణి. ఇప్పుడు వేలు పెట్టడం తగ్గించేశాను(నవ్వుతూ). గుణశేఖర్ దర్శకత్వంలో రానా చేసే ‘హిర ణ్య’కు రెండేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ను సక్రమంగా అనుసరించి ఆ సినిమాను తక్కువ టైమ్‌లో వరల్డ్ క్లాస్ మూవీగా రూపొందించనున్నాం. ‘అసురన్’ రీమేక్‌తో పాటు, తరుణ్ భాస్కర్‌తో, త్రినాథరావు నక్కినలతో సినిమాలు చేస్తారు వెంకటేశ్.
టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలిసి పని చేయడంతో నమ్మకం ఏర్పడింది. ఈ కథను మొదట వివేక్ కూచిభొట్ల విన్నారు. ఆ తర్వాత సురేశ్‌బాబుగారి దగ్గరకు తీసుకెళ్లాం. దేనికైనా ప్లానింగ్ ముఖ్యం. మా బేనర్‌లో 20 సినిమాల వరకూ సిద్ధం కాబోతున్నాయి’’ అన్నారు.
► ‘వెంకీ మామ’ను దసరాకు రిలీజ్ చేయాలనుకున్నాం. వెంకటేశ్ కాలికి గాయం కావడంతో ఆలస్యం అయింది. నవంబర్ అనుకున్నాం. ఆ తర్వాత డిసెంబర్ 13కి ఫిక్స్ చేశాం. రిలీజ్ డేట్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యాం. సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు.
► డిజిటల్ మాద్యమాలు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ రావడంతో థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులు తగ్గుతున్నారు అంటున్నారు. వాళ్లను థియేటర్‌కి రప్పించే సినిమాలు చేయడం మీద దృష్టిపెట్టాలి. హీరోలందరూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తే బావుంటుంది. సినిమా మేకింగ్‌లో చాలా శాతం అసమర్థత కనిపిసోంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి.
► గతంలో దాసరి గురువు పాత్రను పోషించారు. ఇప్పుడు ఎవరూ ఆ బాధ్యతను తీసుకోవడంలేదనే ప్రశ్నకు స్పందిస్తూ – ‘‘దాసరిగారిని గురువులా అందరూ అంగీకరించారు. ఆ స్థానంలో ఇప్పుడు ఎవర్నీ అంగీకరించలేకపోతున్నారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment