‘పట్నంలో శాలిబండ...’ పాట మార్మోగుతూనే ఉంది! | Venugopala Charyulu interview | Sakshi
Sakshi News home page

‘పట్నంలో శాలిబండ...’ పాట మార్మోగుతూనే ఉంది!

Published Mon, Dec 16 2013 2:55 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

‘పట్నంలో శాలిబండ...’ పాట  మార్మోగుతూనే ఉంది! - Sakshi

‘పట్నంలో శాలిబండ...’ పాట మార్మోగుతూనే ఉంది!

 ‘పదవే పోదాము గౌరీ...’, ‘జయజయజయ శ్రీ వేంకటేశ...’, ‘ఎంత మంచివాడవురా...’, ‘పయనించే ఓ చిలుకా...’, ‘పట్నంలో శాలిబండ, పేరైనా గోలుకొండ...’ ఏనాటి పాటలవి... ఎంత వినసొంపైన రాతలవి... రాసిన చేతులకు మొక్కాలనిపించేంత చక్కని సాహిత్యమది. చేతుల్లోనే కాదు చేతల్లోనూ స్వఛ్చతను నింపుకున్న మనిషికి మాత్రమే స్వంతమయ్యే పద‘సంపద’ది. హైదరాబాద్, చిక్కడపల్లిలోని ఓ గల్లీలో సాదా సీదాగా కనిపించే ఇంట్లో  ఎనభై మూడేళ్ల వేణుగోపాలాచార్యులును కలిసినప్పుడు ఆయనలోని అక్షర సంపన్నుడు అర్థమయ్యారు. తెలుగు, ఉర్ధూ, హిందీ, సంస్కృతం భాషల్లో ప్రావీణ్యులైన వేణుగోపాలాచార్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా, ప్రవృత్తి రీత్యా రచయిత. కొన్ని దశాబ్థాల క్రితం ఆయన కలం స్రవించిన అక్షరాలతో అల్లుకున్న పాటలు ఇప్పటికీ జనరంజకమే.  కళామతల్లి మీద అవ్యాజానురాగాలే తప్ప కాసుల కక్కుర్తి లేని ఈ ఆచార్యులు... తన కలం బలాన్ని  ఏరకంగానూ సొమ్ము చేసుకోలేకపోయారు. 
 ఆయన ‘సాక్షి’తో పంచుకున్న  అను‘భావాలు’ ఆయన మాటల్లోనే...
 
 ఆ పాట సినిమాలో వాడలేదు కానీ...
 టీచర్ ఉద్యోగం చేస్తూనే నా కవితాభిలాషను భిన్న మార్గాల్లో తీర్చుకుంటుండేవాణ్ణి. ‘నాస్తిక్’ సినిమాలో ‘దేక్ తెరీ సంసార్ హాలత్’ పాటను ‘ఎటు మారెనో ఈ ప్రపంచ నడవడి కనుగొనవో దేవా’ అని ట్యూన్‌కు అనుగుణంగా మార్చి పాడుతుంటే ఎందరో అభినందించారు. నటరాజ రామకృష్ణగారి సిఫారసు లేఖతో మద్రాసు వెళ్లి, ‘ముద్దుబిడ్డ’ సినిమా తీస్తున్న దర్శక నిర్మాత కేబీ తిలక్‌ని కలిశాను. అదే సమయంలో పి.పుల్లయ్య గారు ‘శ్రీ వెంకటేశ్వర మహాత్యం’ తీస్తున్నారు. అందులో పాటలన్నీ ఆత్రేయగారు రాసేశారు అప్పటికీ నేను బతిమాలితే... రమణారెడ్డి, సురభి బాలసరస్వతి పాత్రల కోసం ‘చిలకో చిక్కావె ఈనాడు సింగార మొలుకుతూ’’ పాట రాయించారు. ఆ తర్వాత ఆయనే ‘పదవే పోదాము గౌరి పరమాత్ముని జూడ’, ‘జయజయజయ శ్రీ వెంకటేశ జయజయజయజయ శ్రీతజనపోషా’ రాయించారు. దీన్ని సినిమాలో వాడలేదు. అయితే ఘంటసాల ప్రైవేటుగా పాడిన ఈ పాట ఇప్పటికీ తిరుమల సహా వెంకటేశ్వరుని ఆలయాల్లో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది.  అమాయకుడు,  మమకారం, భాగ్యవంతులు, పచ్చని సంసారం, దేవుడున్నాడు, సంధ్యాదీపం తదితర చిత్రాల్లో కూడా పాటలు రాశాను. ‘అమాయకుడు’ సినిమా కోసం నేను రాయగా ఎల్లారీశ్వరి పాడిన ‘పట్నంలో శాలిబండ పేరైనా గోలుకొండ’ నాటి నుంచి నేటి వరకూ ప్రతి తెలుగింటిలోనూ మార్మోగుతూనే ఉంది. అలాగే ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ తెలంగాణలో నిత్యస్మరణం. సంస్కృతం నుంచి నేను తెలుగులోకి అనువాదం చేసిన ‘శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం’ను ఘంటసాల ఎంతో ఇష్టపడి ఆలపించడం నాకో మధుర జ్ఞాపకం.
 
 ఎన్టీఆర్ పేరు మార్చారు!
 ఓ సినిమా స్క్రిప్టు పనిమీద ఎన్టీఆర్‌ని కలిసినప్పుడు ఆచారి అని కాకుండా వేణుగోపాల్ అని మార్చుకోమని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి అదే పేరు మీద కంటిన్యూ అయ్యాను. నాకెంతో ఇష్టమైన యాదగిరి పుణ్యక్షేత్రం మీద భక్తితో ‘యాదగిరి మహాత్యం’ సినిమాకి దర్శకత్వం వహించాను. కన్నడ రాజ్‌కుమార్ ‘రాఘవేంద్ర మహాత్యం’ తెలుగులో తీస్తుంటే మాటలు, పాటలు రాశాను. 
 
 పాట రాయాలనే తప్ప పైసా పోగేయాలని చూడలేదు...
 ఇప్పుడున్నన్ని ప్రయాణ సౌకర్యాలు అప్పుడు లేవు కదా. ఉపాధ్యాయవృత్తిలో ఉంటూనే మద్రాసు వెళ్లి సినిమాలకు పనిచేయడం... ఈ రెండు పడవల ప్రయాణం అంత తేలికగా సాగింది కాదు.  విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో లాస్ ఆఫ్ పేలు, సెలవులు పెట్టుకుని వెళ్లొస్తుండేవాడ్ని. ఆదాయపరంగా  పెద్దగా ఒరిగిందేమీ లేకపోయినా... నాలోని కవితావేశాన్ని, సినీరంగం పట్ల ఆపేక్షని అదుపుచేసుకోలేదు. నా స్వంత రచనలతో పాటు హిందీ సినిమా పాటల్ని తెలుగులోకి మార్చి రాసినవి చాలా మందికి వినిపిస్తే... చెప్పా పెట్టకుండా వాడేసుకున్నారు. పారితోషికం కాదు కదా కనీసం నా పేరు కూడా టైటిల్స్‌లో  వేయలేదు. అలాంటి మోసాలు చాలానే భరించాను. అయితే ఈ వయసులో కూడా ఇంత తృప్తిగా ఉన్నానంటే పాటకు పైసాకు లింకు పెట్టకపోవడం వల్లనే. ఇప్పుడంతా స్పీడైపోయి... పాడైపోయిందనుకోండి. వెంకటేశ్వరస్వామి మీద రాసిన వందలకొద్దీ భక్తి పాటలు, జానపద గీతాలు,  శృంగార గీతాల సహా వేలాదిగా నా దగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ ఎవరైనా సరే సినిమాల్లో గాని, ప్రైవేటు ఆల్బమ్స్‌లోగానీ ఏదో ఒక రూపంలో వినియోగించుకుంటే బావుంటుంది.
 - ఎస్.సత్యబాబు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement