
అందుకే కోర్ట్‌ని ఆస్కార్ బరికి పంపించాం
తెలుగులో ఏ రచయితకూ దక్కని అదృష్టం నాకు దక్కింది. ఆస్కార్‌కు భారతీయ చిత్రాన్ని ఎంపిక చేసే పదిహేడు మంది జ్యూరీలో నేనూ ఒకణ్ణి’’
‘‘తెలుగులో ఏ రచయితకూ దక్కని అదృష్టం నాకు దక్కింది. ఆస్కార్‌కు భారతీయ చిత్రాన్ని ఎంపిక చేసే పదిహేడు మంది జ్యూరీలో నేనూ ఒకణ్ణి’’ అని వై. వెంకటరామ్ చెప్పారు. ఇటీవల ఇండియన్ ఆస్కార్ జ్యూరీ మన దేశం నుంచి ‘కోర్ట్’ చిత్రాన్ని ఆస్కార్ విదేశీ విభాగం పోటీకి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ జ్యూరీలో సభ్యుడైన వెంకటరామ్ మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ -‘‘కాలేజీ బుల్లోడు, చంద్రలేఖ, నీ కోసం తదితర చిత్రాలకు సంభాషణలు రాశా.
శోభన్‌బాబుతో ‘హలో గురూ’ చిత్రం డెరైక్ట్ చేశా. ఆ తర్వాత ఆస్ట్రాలజిస్ట్‌గా బిజీ అయిపోయా’’ అని చెప్పారు. ఆస్కార్ జ్యూరీలో తన అనుభవాలను వివరిస్తూ -‘‘మొత్తం 30 సినిమాలు చూశాం. తెలుగు నుంచి ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ కూడా వచ్చాయి. ‘బాహుబలి’ అందరికీ నచ్చిన సినిమానే అయినా కూడా, ఇక్కడ ప్రజాదరణ ప్రధానం కాదు. కొత్త ఆలోచన, కొత్త స్క్రీన్‌ప్లే, సినిమాకు సరికొత్త నిర్వచనమిచ్చే వాటికే ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ టెక్నాలజీ ముఖ్యం కాదు.
ఆ అంశాల ప్రకారం చూస్తే మరాఠీ సినిమా ‘కోర్ట్’ ముందు వరుసలో నిలిచింది. గొప్ప కథ కాకపోయినా, సమాజ వాస్తవికతను యధాతథంగా ఒడిసిపట్టడం అందర్నీ ఆకట్టుకుంది’’ అని వెంకటరామ్ చెప్పారు. ఆంగ్లంలో ‘జర్నీ టూ అన్‌నోన్’ పేరుతో త్రీ డైమన్షనల్ మెటా ఫిజికల్ నవల రాస్తున్నానని, అలాగే సినిమాలకు కథలు సిద్ధం చేస్తున్నానని వెంకటరామ్ తెలిపారు.