ఐశ్వర్యా రాయ్, రేఖ
ఐశ్వర్యా రాయ్‌కి 20 ఏళ్లు. ఏంటీ విచిత్రంగా ఉందా? నటిగా ఆమె వయసిది. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో దాదాపు అలానే ఉన్నారు ఐష్. చెక్కు చెదరని అందంతో, సినిమా సినిమాకి మెరుగవుతున్న అభినయంతో ఐష్ తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. ఈ అందాల సుందరికి బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ ఐష్‌ని అభిమానించేవాళ్లు ఉన్నారు. వాళ్లల్లో ఎవర్‌గ్రీన్ బ్యూటీ రేఖ ఒకరు. నటిగా ఐష్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పట్ల తనకున్న అభిమానాన్ని లేఖ రూపంలో వర్ణించారు. ఆ లేఖ సారాంశం ఇది.
‘‘మై ఐష్...
నువ్వు ప్రవహించే నదిలాంటిదానివి. ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నావు. నది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. తన గమ్యాన్ని తను అన్నుకున్నట్లుగానే, తనలాగే చేరుకుంటుంది. నువ్వూ అంతే. నువ్వేం చెప్పావన్నది జనం మర్చిపోవచ్చు. నువ్వేం చేశావన్నది కూడా మర్చిపోవచ్చు. కానీ నువ్వు వాళ్లకు ఎలాంటి ఫీలింగ్ కలిగించావు అన్నది మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. మనం ఏదైనా సాధించాలంటే మనకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం ధైర్యం.
ఎందుకంటే అది లేకపోతే మనం ఎందులోనూ నైపుణ్యం పొందలేం. ఈ విషయంలో నువ్వు దానికి లైవ్ ఎగ్జాంపుల్. నువ్వు నోరు తెరిచి మాట్లాడేలోపే నీ నమ్మకం, నీ శక్తి మాతో మాట్లాడేస్తాయి. నువ్వు అనుకున్నవన్నీ సాధించావు. అవి కూడా ఎంత అందంగా సాధించావంటే మా అందరి కళ్లు నీ నుంచి మరల్చుకోలేనంత. జీవితంలో చాలా దూరం వచ్చావు. ఎన్నో కష్టాలు అనుభవించావు. కానీ ఫీనిక్స్ పక్షి లాగా వీటన్నింటినీ దాటి పైకి లేచావు.
నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నా అన్నది మాటల్లో వర్ణించలేకపోతున్నా. నువ్వు చాలా పాత్రలు అత్యద్భుతంగా పోషించావు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకున్నావు. కానీ నువ్వు చేసిన అన్ని పాత్రల్లో నాకు ఇష్టమైందేంటో తెలుసా? ఇప్పుడు ఆరాధ్య అనే అద్భుతానికి పోషిస్తున్న ‘అమ్మ’ పాత్ర. ప్రేమిస్తూనే ఉండు, నీ మ్యాజిక్‌ని పంచుతూనే ఉండు. 20 ఏళ్లు అయిపోయిందా అప్పుడే! వావ్.నీ హృదయం మోయలేనన్ని, పట్టలేనన్ని శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు.
లవ్ యూ, జీతే రహో రేఖా మా’’.
Comments
Please login to add a commentAdd a comment