భారతీరాజాతో సినిమాటోగ్రాఫర్ కన్నన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నన్(69) శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు భీమ్ సింగ్ కుమారుడైన కన్నన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అయన ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దిగ్గజ దర్శకుడు భారతీరాజాతో కలిసి దాదాపు 40 సినిమాలకు పనిచేశారు. దీంతో కన్నన్‌ను భారతీరాజా రెండు కళ్లు అని పిలుస్తుండేవారు. వీరద్దరి కాంబినేషనలో వచ్చిన మొదటి చిత్రం నిజల్‌గళ్ కాగా, చివరి చిత్రం బొమ్మలాట్టమ్. ఇక తెలుగులో పగడాల పడవ, కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన చిత్రాలకు పనిచేసిన కన్నన్ తన కెమెరా పనితనం చూపించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కన్నన్ పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. రేపు(ఆదివారం) అంత్యక్రియలు నిర్వహిస్తామని కన్నన్ సన్నిహితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment