గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే | Victory Venkatesh Speech At Valmiki Pre Release Event | Sakshi
Sakshi News home page

గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే

Published Mon, Sep 16 2019 12:09 AM | Last Updated on Mon, Sep 16 2019 5:00 AM

Victory Venkatesh Speech At Valmiki Pre Release Event - Sakshi

వంశీకృష్ణ, గోపీ ఆచంట, హరీష్‌ శంకర్, రామ్‌ ఆచంట, వెంకటేశ్, వరుణ్‌ తేజ్, మిక్కీ జె.మేయర్, పూజాహెగ్డే, మృణాళిని రవి, డింపుల్, హరీష్‌ కట్టా

‘‘మా కోబ్రా (కో–బ్రదర్‌. ‘ఎఫ్‌ 2’ లో వరుణ్‌ పాత్రను ఉద్దేశించి) లుక్‌ మొత్తం మార్చేశాడు.. ‘ఎఫ్‌ 2’ నుంచి ‘వాల్మీకి’ చిత్రానికి గెటప్‌ మార్చేశాడు. ఈ ట్రైలర్‌ చూడగానే టెరిఫిక్‌గా అనిపించింది. ‘గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే’’ అని హీరో వెంకటేశ్‌ అన్నారు. వరుణ్‌తేజ్, పూజాహెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈనెల 20న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఆ వాల్మీకి దొంగ.. మంచిగా మారి  రామాయణం రాశారు. మరి.. ఈ వాల్మీకి ఏం రాశాడో థియేటర్స్‌కు వెళ్లి చూడాలి. నాకు నమ్మకం ఉంది.. మా వరుణ్‌ రెచ్చిపోయి ఒక సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ ఇస్తాడు. నా స్నేహితుడు పవన్‌ కల్యాణ్‌కు హరీశ్‌ శంకర్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ అనే బ్లాక్‌బస్టర్‌ సినిమా ఇచ్చాడు. మా వరుణ్‌కి కూడా సూపర్‌ హిట్‌ ఇస్తాడని నమ్మకంగా ఉన్నాను. నిర్మాతలు రామ్, గోపి కలిసి నాతో ‘నమో.. వెంకటేశ’ చేశారు. చాలా ప్యాషన్‌తో సినిమా చేస్తారు.. కానీ, సింపుల్‌గా  ఉంటారు. ‘వాల్మీకి’ పెద్ద హిట్‌ అవ్వాలి, మంచి కలెక్షన్స్‌ రావాలి’’ అన్నారు.   

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ గద్దలకొండ గణేశ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన మా సింగిల్‌ హ్యాండ్‌ గణేశ్‌ వెంకటేశ్‌ సర్‌కి థ్యాంక్స్‌. నేను ఫోన్‌ చేసి రావాలనగానే వెంటనే ఓకే అన్నారు.. అంత మంచి మనసు ఆయనది. ‘వాల్మీకి’ నా 9వ సినిమా. ఇప్పటి వరకూ ప్రయోగాలు, క్లాస్, లవ్‌స్టోరీలంటూ సినిమాలు చేశాను. ఫస్ట్‌ టైమ్‌ ఓ మాస్‌ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. మామూలుగా లేదమ్మా. చిరంజీవిగారు ఎప్పుడూ చెబుతుండేవారు.. ‘అరేయ్‌ మేము మాస్‌ సినిమాలు ఎందుకు చేస్తామో నీకు అర్థం కావట్లేదు అని’.. ఇప్పుడు ఫైనల్‌గా ఆ రుచిని కొంచెం చూశా.. థ్యాంక్యూ డాడీ. మా దాహం తీరే సినిమా ఎవరిస్తారు అనుకున్నాం.. హరీష్‌గారి ‘గబ్బర్‌సింగ్‌’ చూసినప్పుడు ఇదీ సినిమా అనిపించింది. మా బాబాయికి అంతపెద్ద సినిమా ఇచ్చిన ఆయన  నాతో చేయడం నా అదృష్టం. రామ్, గోపీగార్లతో నా ప్రయాణం ఇకముందు కూడా సాగుతుందని కోరుకుంటున్నా. ‘ముకుంద’ సినిమా తర్వాత పూజాహెగ్డేతో చేద్దామనుకున్నా.

ఆ సినిమా చేస్తున్నప్పుడు ‘అరే ఇంత అందమైన అమ్మాయిని పెట్టి మా మధ్య మాటలు ఇవ్వలేదు ఏంట్రా?’ అనిపించింది.. కానీ ‘వాల్మీకి’లో హరీష్‌గారు మా ఇద్దరి మధ్య మంచి సీక్వెన్స్‌ ఇచ్చారు. శోభన్‌బాబుగారి ‘వెల్లువొచ్చే గోదారమ్మ..’ రీమిక్స్‌ పాట చాలా బాగా వచ్చింది. మీ అందర్నీ(అభిమానులు) చూస్తే మా కుటుంబం ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది.. థ్యాంక్యూ. నిన్ననే చిరంజీవిగారిని, చరణ్‌ అన్నని కలిశా. ‘సైరా’ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ, వాళ్ల ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటాయి. ‘వాల్మీకి’ ట్రైలర్‌ చూసి బాబాయ్‌(పవన్‌ కల్యాణ్‌) నాతో, హరీష్‌గారితో మాట్లాడారు.. చాలా బాగుంది.. తెలంగాణ యాసలో చాలా బాగా మాట్లాడావు అన్నారు. మా ఫ్యామిలీని సపోర్ట్‌ చేస్తున్న మీ అందరికీ(అభిమానులు) మళ్లీ మళ్లీ థ్యాంక్స్‌. కచ్చితంగా మీ అందరికీ ‘వాల్మీకి’ నచ్చుతుంది. అక్టోబర్‌ 2న మన ‘సైరా నరసింహారెడ్డి’ కూడా వస్తోంది. ‘వాల్మీకి’ని ఎంత హిట్‌ చేస్తారో అంతకు రెండు రెట్లు ‘సైరా’ ని కచ్చితంగా హిట్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.  
 
నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘వాల్మీకి’ టైటిల్‌ పెట్టడానికి కొంచెం గుండె ధైర్యం కావాలి.. సాహిత్యంపై పట్టుండి, ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి హరీష్‌లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్‌ ఈ టైటిల్‌ ఎంపిక చేసుకున్నాడేమో అనిపించింది. వరుణ్‌తేజ్‌ మామూలోడు కాదని గత సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ‘వాల్మీకి’ చూస్తే అసాధారణ నటుడు అనిపిస్తుంది. మా గురువు చిరంజీవిగారు, ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌.. వారి మధ్యలో ఉన్నాడు అర్జునుడు నాగబాబు.. అతను సంధించి వదిలిన బాణం మన వరుణ్‌. మా బాస్‌ వెంకటేశ్‌ ఉన్నాడు ఎదురుగా.. ‘సుందరకాండ’ దగ్గరి నుంచి చాలా సినిమాల్లో మా కాంబినేషన్‌లో చేశాం. ఆయన కొన్ని సినిమాలనే ఎంచుకుని అతిథిగా వస్తుంటారు. ‘వాల్మీకి’ సినిమాకి ముఖ్య అతిథిగా రావడం చాలా గొప్ప విషయం. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట మంచి క్రమశిక్షణ, మనసున్నవారు. ‘వాల్మీకి’అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’అన్నారు.

 నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘పవన్‌కల్యాణ్‌గారితో ‘గబ్బర్‌సింగ్, సాయిధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్, బన్నీతో ‘డీజే’... ఇలా మెగా ఫ్యామిలీతో హిట్స్‌ కొట్టాడు హరీష్‌.. ఇప్పుడు వరుణ్‌తో కూడా ‘వాల్మీకి’తో హిట్‌ కొడుతున్నాడు. మా ‘ఎఫ్‌ 2’ వెంకటేశ్‌గారు ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చారు.. ‘ఎఫ్‌ 2’ లాగా  ‘వాల్మీకి’ చిత్రానికీ తిరుగులేదు. ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు గోపీ, రామ్‌. ‘వాల్మీకి’ పెద్ద హిట్‌ కావాలి.. ఆల్‌ ది బెస్ట్‌ టీమ్‌’’ అన్నారు.

హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘భాస్కరభట్లగారు ‘జర జర..’ పాట రాస్తున్నప్పుడు వాళ్ల అమ్మగారు చనిపోయారు.. అయినా రాసి ఇచ్చారు. చంద్రబోస్‌ అన్నయ్యగారితో నా సినిమాలో ఓ పాటైనా రాయించుకోకపోతే వెలితిగా ఉంటుంది. వనమాలిగారు చక్కనిపాట రాశారు. ఇతర భాషలతో పోలిస్తే రచయితలు, పాటల రచయితలకు మనం ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదేమో అనిపిస్తోంది. మనకు నచ్చిన పాటలు, లిరిక్స్‌ని తోటివారితో షేర్‌ చేసుకోండి. తద్వారా మన భాషను మనం కాపాడుకున్నవాళ్లం అవుతాం. కెమెరామెన్‌ బోస్, మిక్కీ జి. మేయర్‌ ఈ  సినిమాకి రెండు స్తంభాల్లాంటివారు. నాకోసం ఈ సినిమాలో ప్రత్యేక పాట చేసినందుకు డింపుల్‌కి థ్యాంక్స్‌. ‘డీజే’ లో పూజాహెగ్డే గ్లామర్‌ నచ్చితే, ‘వాల్మీకి’లో తన నటన నచ్చుతుంది.

‘ఎఫ్‌ 2’ టైమ్‌లో వెంకటేశ్‌గారిని కలిశా. ఆయన్ని కలిసే వరకూ తెలియదు అంత సరదాగా ఉంటారని. 85రోజులు షూటింగ్‌ చేశాం.. ఇన్ని రోజులూ నవ్వుతూ పనిచేసిన నా మొదటి హీరో వరుణ్‌. ఈ కాలం జనరేషన్‌లో ఓ హీరో ఫోన్‌ పక్కన పెట్టి పనిపైనే శ్రద్ధ పెట్టేవాడు వరుణ్‌ ఒక్కడే. నెలరోజులు తెలంగాణ యాసలో డబ్బింగ్‌ చెప్పాడు. డబ్బులు పెట్టేవారు చాలామంది ఉంటారు.. కానీ ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, ‘దిల్‌’ రాజుగారు. వారం కిందట పవన్‌ కల్యాణ్‌గారిని కలిశా. ఆయనకి ‘వాల్మీకి’ ట్రైలర్‌ బాగా నచ్చింది. సినిమా గురించి తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ‘గబ్బర్‌సింగ్‌’ అప్పుడు ఎలా కోరుకున్నారో ఇప్పుడూ అదే సంకల్పంతో కోరుకోండి (పవన్‌ కల్యాణ్‌ అభిమానులను ఉద్దేశించి) అప్పుడే సినిమా కుదురుతుంది’’ అన్నారు.

నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ– ‘‘ఇక్కడి విచ్చేసిన మెగాస్టార్, పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి, మా తొలి సినిమా హీరో వెంకటేశ్‌బాబుకి థ్యాంక్స్‌. ఎప్పటి నుంచో వరుణ్‌తో సినిమా చేద్దామని రెండు మూడు కథలు అనుకున్నా, కుదరలేదు. ఇప్పుడు ‘వాల్మీకి’లాంటి మంచి కథతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. పవర్‌స్టార్‌తో ‘గబ్బర్‌సింగ్‌’ తీసి ఎలా అలరించారో వరుణ్‌తో ‘వాల్మీకి’ తోనూ అలా అలరిస్తారు హరీష్‌’’ అన్నారు. ‘‘నాకు శ్రీదేవిలాంటి మంచి పాత్ర ఇచ్చినందుకు హరీష్‌ సర్‌కి చాలా థ్యాంక్స్‌’’ అన్నారు పూజాహెగ్డే.  నిర్మాత అనీల్‌ సుంకర, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయితలు భాస్కరభట్ల, చంద్రబోస్, వనమాలి, నటి డింపుల్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement