
తమిళసినిమా: యువ నటుడు విజయ్‌సేతుపతి వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజా చిత్రం ఒరు నల్లనాళ్ పాత్తు చిత్రం కూడా వసూళ్ల వర్షం కురిపించింది. పలు చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్‌సేతుపతి నిర్మాతగా కూడా మారారు. ఆయని నిర్మిస్తూ నటిస్తున్న జూంగా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కుతోంది. కాగా తాజాగా ఆయన గాయకుడి అవతారమెత్తారు.
పేయ్ పసి అనే చిత్రం కోసం యువన్‌శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ఆయన ఒక పాడారు. శ్రీనివాస్ కవినయన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పేయ్ పసి. నవ నటుడు హరికృష్ణ భాస్కర్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని రైస్ ఈస్ట్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీనిధి సాగర్ నిర్మిస్తున్నారు.
ఇందులో చాలా కీలకమైన ఒక క్లబ్ పాటకు డిఫరెంట్ వాయిస్ అవసరం అయ్యిందని, ఆ పాటను నటుడు విజయ్‌సేతుపతితో పాడిస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులందరు భావించినట్లు సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా పేర్కొన్నారు. తనదైన సంభాషణల డెలివరీతో అభిమానులను ఆకట్టుకుంటున్న విజయ్‌సేతుపతి పేయ్ పసి చిత్రంలోని క్లబ్ పాటను చాలా బాగా పాడారని అన్నారు. ఈ పాట చిత్రానికి హైలైట్ అవడంతో పాటు, యూత్‌ను విపరీతంగా అలరిస్తుందని యువన్‌శంకర్‌రాజా పేర్కొన్నారు.