నాలుగు దేశాల్లో ఫైట్ చిత్రీకరణ
ధ్రువనక్షత్రం చిత్రం కోసం సిమాన్ విక్రమ్ నాలుగు దేశాల్లో ఫైట్ చేశారు. ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న రెండు చిత్రాల్లో ధ్రువనక్షత్రం ఒకటి. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్, రీతువర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ తర్వాత ఆగిపోవడంతో ధ్రువనక్షత్రం చిత్రం తెరెకెక్కుతుందా లేదా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనికి పుల్‌స్టాప్ పెట్టేలా ఈ చిత్రం మరిన్ని ప్రత్యేకతలతో, మరింత భారీగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
మొదట్లో ప్రకటించిన తారల జాబితాలో తాజాగా ఒకనాటి కథానాయికలు రాధికాశరత్‌కుమార్, సిమ్రాన్‌లతోపాటు నటుడు పార్థిబన్, డీడీగా ప్రాచుర్యం పొందిన దివ్యదర్శిని, వంశీ వచ్చి చేరారు. స్లొవేనియా, బల్గేరియా, టర్కీ, అబుదుబాయ్ దేశాల్లో 22 రోజుల్లో బ్రహ్మాండమైన పోరాట దృశ్యాన్ని దేశవిదేశాలకు చెందిన 12మందితో కూడిన చిత్ర యూనిట్ చిత్రీకరించింది. ఈ పోరాట దృశ్యాలను ఛాయాగ్రాహకుడు మనోజ్ నేతృత్వంలో తిశారు. ఇప్పటివరకు ఈ నాలుగు దేశాల్లో దక్షిణాదికి చెందిన వారెవరూ షూట్ చేయని లొకేషన్లను ఎంపిక చేసి తిశారు. ఇలా ఒక ఫైట్‌ను నాలుగు దేశాల్లో చిత్రీకరించడం అరుదైన రికార్డు అంటున్నారు ధ్రువనక్షత్రం చిత్ర వర్గాలు.