నా తండ్రి భిక్షమడగడం కళ్లారా చూశా: టాప్ హీరో
పెరంబూర్: నా తండ్రి భిక్షమడగడం నేను కళ్లారా చూశాను అని హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. ఏప్రిల్ 2న జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్యానల్ సభ్యుల పరిచయ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నిర్మాతలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని తెలిపారు. నడిగర్ సంఘంలో జరిగే మంచి పనులు ఆ సంఘంలోని సభ్యులకే లబ్ధి చేకూరుస్తాయని, అదే నిర్మాతల మండలిలో అయితే పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు. కాగా నడిగర్ సంఘానికి తమ కార్యవర్గం చేసిన వాగ్ధానాలన్ని నెరవేర్చామన్నారు. అదే విధంగా నిర్మాతల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తామన్నారు. తన తండ్రి మహాప్రభు వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారని, ఐ లవ్ ఇండియా చిత్రం నిర్మించి.. దాన్ని అనుకున్న తేదీకి విడుదల చేయడానికి ఒక ల్యాబ్ ముందు భిక్షమడిగారన్నారు. తాను చేసిన ఒకే ఒక తప్పు ఈ చిత్రాన్ని నిర్మించడం అని ఆయన అన్న మాటలు తనను ఇంకా కలచివేస్తున్నాయని పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితి ఏ నిర్మాతకు రాకూడదన్నారు. తాను నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని తన తండ్రికి చెప్పినప్పుడు పోటీలో నెగ్గి ఏం చేస్తావని ఆయన ప్రశ్నించారని అన్నారు. ప్రతి నిర్మాతకు కనీసం అర గ్రౌండ్ లేదా పావు గ్రౌండ్ స్థలాన్ని అందించగలిగితేనే ఇంటికి రా లేకపోతే రావొద్దు అని తన తండ్రి అన్నారని విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్యానల్ వాగ్ధానాల పట్టికను వెల్లడించారు.