అజిత్‌కి ఏమైంది?
మంచు దుప్పటి కప్పేసిన ప్రాంతంలో ఓ మడుగు... అదీ రక్తపు మడుగు! అందులో నుంచి మెల్లగా బయటకు నడుచుకొస్తున్న ఓ మనిషి... అతని శరీరమంతా రక్తపు చారలు, కాలిన గాయాలు. అయినా వీరోచితంగా పోరాడుతున్నాడు. అతనెవరో కాదు... అజిత్. సడన్‌గా ‘కట్’ అనే సౌండ్ వినిపించింది. వెంటనే ఫైట్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసిన అజిత్ రక్తపు మడుగు నుంచి కాస్త పక్కకు జరిగారు. అప్పుడు తీసిన ఫొటోనే మీరు చూస్తున్నారు. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘వివేగమ్’. ఇందులో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారట. ప్రస్తుతం బల్గేరియాలో చిత్రీకరణ జరుగుతోంది.
బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరో ఇంటర్‌పోల్ ఆఫీసర్ కనుక ఎక్కువ శాతం చిత్రీకరణ యూరోపియన్ దేశాల్లోనే జరుపుతున్నారు. ఈ చిత్రంలో అజిత్ ఫస్ట్ లుక్‌ను ఎప్పుడో విడుదల చేశారు. సిక్స్ ప్యాక్‌లో అజిత్‌ను చూసిన ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇప్పుడీ లేటెస్ట్ లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్ తమిళ తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట!