
సాక్షి, ముంబయి: ప్రముఖ సినీనటి శ్రీదేవి హఠాన్మరణం అనంతరం ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి స్పందించింది. ఈ నెల (మార్చి) 7న తన 21వ జన్మదినం సందర్భంగా తన తల్లిని స్మరించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన లేఖను పెట్టింది. 'అమ్మా.. నువ్వు గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను' అంటూ ఆ లేఖ మొత్తం సారాంశంగా పేర్కొంది. అమ్మ తనకు దూరమైన ప్రతిక్షణం తనతో ఉన్నట్లే అనిపిస్తుందని, ఎప్పుడూ ఆమె ప్రేమ తన చుట్టే ఉన్నట్టు భావిస్తానని జాన్వీ తెలిపింది. అనూహ్యంగా అంధకారంగా మారిన తన జీవితంలో తన తల్లినే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లతానని వెల్లడించింది. 'ఇప్పటికీ నీ ప్రేమను పొందగలుగుతున్నాను. బాధ, నొప్పి నుంచి నువ్వే.. నన్ను రక్షిస్తున్నావని అనుకుంటున్నాను.
ప్రతిసారి నేను నా కళ్లు మూసుకుంటే నాకు మంచి విషయాలే కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నువ్విచ్చినవే. నువ్వు చాలా మంచి దానివి. స్వచ్ఛమైన మనసు, ప్రేమగల తల్లివి. అందుకే దేవుడు నిన్ను తీసుకెళ్లాడు. నేను చాలా సంతోషంగా ఉండేదాన్నని నా స్నేహితులు చెబుతుంటారు.. అందుకు కారణం నువ్వే. నాకు ఎప్పుడూ ఏది కష్టం, బాధ, నీరసం అనిపించలేదు. అందుకు కారణం నువ్వే అమ్మా. నన్ను ఎంతగానో ప్రేమించావు నీవు. నువ్వు నా ఆత్మలో భాగం. నీ మొత్తం జీవితాన్ని మా కోసమే ఇచ్చావు. అందుకే ఇక నుంచి నువ్వు గర్వపడేలాగా ఉంటాము. ప్రతి రోజు నిన్ను తలుచుకునే పని ప్రారంభిస్తాను.. ఎప్పటి మాదిరిగానే నిన్ను నిద్రలేపుతాను.. ఎందుకంటే నువ్వు ఇక్కడే మాతో ఉన్నావని భావిస్తాను.. నిన్ను నేను తెలుసుకోగలను. నువ్వు నాలో, ఖుషీలో, నాన్నలో ఉన్నావు' అంటూ పలు భావోద్వేగ అంశాలతో జాన్వీ ఆ లేఖలో తన మనసులోని భావాలను పంచుకుంది.
ప్రతి ఒక్కరూ తన తల్లికి ఆత్మ శాంతికలగాలని కోరుకోవాలని జాన్వీ విజ్ఞప్తి చేసింది. తన తండ్రి, తల్లి ఎంత ప్రేమగా ఉండేవారో తనకు బాగా తెలుసని చెప్పింది. 'నేను, ఖుషీ తల్లిని మాత్రమే కోల్పోయాం.. కానీ, మా నాన్న ఆయన మొత్తం జీవితాన్ని కోల్పోయారు. మా నాన్నకు ఆమె నటిగా, తల్లిగా, భార్యగా కంటే చాలా ఎక్కువ. అది ఎంతో నేను చెప్పలేను' అంటూ కూడా జాన్వీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment