ఆ సినిమా పాక్‌లో విడుదలవ్వాలి
తాను తీస్తున్న తాజా చిత్రం సరబ్‌జిత్.. పాకిస్థాన్‌లో కూడా విడుదలైతే బాగుంటుందని ఆ సినిమా దర్శకుడు ఒమంగ్ కుమార్ అంటున్నారు. ఆ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏవీ లేవు కాబట్టి అక్కడ కూడా విడుదల చేయాలని ఆశిస్తున్నాడు. పాకిస్థానీ జైలులో అక్కడి ఖైదీల చేతిలో దాడికి గురై మరణించిన భారత పౌరుడు సరబ్‌జిత్ సింగ్ గురించి, అతడి ఆచూకీ కోసం అతడి సోదరి దల్బీర్ కౌర్ సాగించిన పోరాటం గురించి ఈ సినిమా ఉంటుంది. పాకిస్థాన్ సెన్సార్ బోర్డుకు కూడా తమ సినిమా పంపుతున్నామని, వాళ్ల ఆమోదంతో అక్కడ కూడా దాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని ఒమంగ్ చెప్పారు. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో రణదీప్ హూడా నటిస్తున్నాడు.
ఇంతకుముందు ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా మేరీ కోమ్ సినిమా తీసి ఘన విజయం సాధించిన ఒమంగ్ కుమార్.. పాకిస్థానీ సెన్సార్ బోర్డు వాళ్లు తన సినిమా చూడాలని కోరుతున్నాడు. వాళ్లు సినిమా చూస్తే అంతా అర్థమవుతుందని చెబుతున్నాడు. సినిమా చూడకుండా అది తప్పని ఎవరైనా ఎందుకు అనాలన్నది ఒమంగ్ వాదన. ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఇంకా ఇతర పాత్రల్లో రిచా ఛద్దా, దర్శన్ కుమార్ తదితరులు నటిస్తున్నారు.