ఆన్‌లైన్ ధర తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం
తమిళసినిమా: సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ చార్జీలను తగ్గించడానికి చర్చలు జరుపుతున్నట్లు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తెలిపారు. జీఎస్టీ పన్నుతో సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆన్‌లైన్ బుకింగ్ చార్జీలను రూ. 30 నుంచి రూ.10కి తగ్గించడానికి చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకు సొంతంగా ఆన్‌లైన్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. థియేటర్లలో ఉన్న సీట్లు, వసూళ్ల వివరాలు థియేటర్ల యాజమాన్యానికే సరిగా తెలియని పరిస్థితి నెలకొనడంతో కేరళలో అమలు పరస్తున్న ఆన్‌లైన్ విధానంలో నకిలీ టికెట్ల విక్రయం అరికట్టవచ్చునని విశాల్ అన్నారు. అందుకు చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.
నటులు పారితోషికాన్ని తగ్గించుకోవాలి
చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ ఈ విషయమై స్పందిస్తూ ఆన్‌లైన్ బుకింగ్ చార్జీలను తగ్గించడం సాధ్యం కాదన్నారు.అదే విధంగా థియేటర్లలో తినుబండారాల గురించి మాట్లాడుతున్నారని, ముందు నటీనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని అన్నారు. ఒక చిత్రం రూ.40 కోట్లు వసూలు చేస్తే అందులో రూ. 30 కోట్లు నటులు పారితోషికం తీసుకుంటున్నారని అన్నారు. ఎంత పెద్ద నటుడైనా కోటి రూపాయలకు మించి పారితోషికం తీసుకోరాదని అభిరామి రామనాథన్ అన్నారు. మరి ఈ చర్చ ఎటు దారి తీస్తుందో వేసి చూడాల్సిందే.