‘నా క్షేమం కోసం ప్రార్థించిన వారికి, మీ ఆలోచనల్లో నన్ను ఉంచినవారికి ఏం చేయగలను? ఏం ఇవ్వగలను? రెండు చేతులు జోడించడం తప్ప?’’ అన్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇటీవలే అమితాబ్ తనకు కోవిడ్ పాజిటివ్ అని ట్వీటర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులకు (కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య) కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వీరందరూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలో తన మదిలో మెదిలిన ఆలోచనలను తన బ్లాగ్ లో పంచుకున్నారు అమితాబ్. అందులోని సారాంశం ఈవిధంగా... ‘‘ఇంతకుముందు ఎవరి పనుల్లో, ఎవరి ప్రపంచంలో వాళ్లం ఉరుకులు పరుగులు తీస్తూ ఉండేవాళ్లం. తీరికగా కూర్చొని జీవితం ఏమైపోతుంది? ఏం జరుగుతుంది? అని ఆలోచించడానికి పెద్దగా సమయం దొరికింది లేదు.
కానీ ప్రస్తుతం మనందరికీ దొరికిన ఈ తీరిక వల్ల ఆలోచించడానికి, ఏం జరుగుతుందో లెక్క వేసుకోవడానికి సమయం దొరికింది. ఇలాంటి సమయంలోనే ఆలోచనలు మన మెదడులోకి మరింత వేగంగా ప్రవేశిస్తుంటాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు ఈ ఆలోచనలు లేవా అంటే మనందరం మన పనులతో బిజీగా ఉండటంతో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఉరికే పరిగెత్తే మెదడు మనందర్నీ విచిత్ర స్థితిలో పడేస్తుంటుంది. ఇలాంటి ఆలోచన మనకు వస్తుందా? అనే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ ఆలోచనలతో ఏకీభవిస్తావు. అంగీకరించవు. పట్టించుకుంటావు. పట్టనట్టు ఉంటావు.
కానీ ఆలోచనలు మాత్రం ఆగవు. ఇలాంటి సమయంలోనే జ్ఞానులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తల మీద గౌరవం మరింత పెరుగుతుంది. సాధారణ మనుషులం ఆలోచించలేని విషయాలను వాళ్లు చాలా కష్టతరమైన కృషితో ఆలోచించి మన ప్రయాణాన్ని సులభం చేస్తున్నారు. కానీ మన అందరిలోనూ అలాంటి ప్రతిభ దాగి ఉంది అని నేను నమ్ముతాను. ప్రస్తుతం నా మదిలో ఆలోచనలు దేని కోసమో నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు సమాధానాలు దొరుకుతాయి. కొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్ రెక్కల్లో చిక్కుకుపోతాయి. అంతా సాధారణ స్థితికి రావాలని కోరుకుంటాయి’’ అని రాసుకొచ్చారు అమితాబ్.
Comments
Please login to add a commentAdd a comment